Friday, June 10, 2022

జ్ఞాన్‌వాపి మసీదు: ఆలయాలను ధ్వంసం చేసి మసీదులు నిర్మించారా, బౌద్ధ ఆరామాలను కూల్చి గుడులు కట్టారా? చరిత్ర ఏం చెబుతోంది

  • వినీత్ ఖరే

  • బీబీసీ ప్రతినిధి

21 మే 2022



 

 

 

 

 

 

 

 

ఫొటో సోర్స్, Robert Nickelsberg/Getty Images

ఇటీవల ఉత్తర్ ప్రదేశ్లోని కాశీ విశ్వనాథ్ మందిరం పక్కనుండే జ్ఞాన్వాపి మసీదులో శివలింగం బయటపడిందని వార్తలు వచ్చాయి.

తాజ్మహల్ను తేజో మహాలయ మందిరంగా చెబుతూ అక్కడ మూసి ఉన్న 22 గదుల్లో ఏముందో వెల్లడించాలని డిమాండ్లు వస్తున్నాయి.

మరోవైపు కుతుబ్ మినార్ కాంప్లెక్స్లోని కువ్వాతుల్ ఇస్లాం మసీదు కూడా హిందువుల ప్రార్థన స్థలమని చెబుతున్నారు.

శ్రీకృష్ణ జన్మభూమి కేసుపై విచారణ చేపట్టేందుకు మథుర జిల్లా కోర్టు అంగీకారం తెలిపింది.

దిల్లీ జామా మసీదు కింద హిందూ దేవతల విగ్రహాలున్నాయని కూడా హిందూ మహాసభ చెబుతోంది.



 

 

 

 

 

 

 

 

ఫొటో సోర్స్, Getty Images

ఎందుకిలా?

అయోధ్యలో రామ మందిరం నిర్మించాలని సుప్రీం కోర్టు సూచించిన తర్వాత, 2019 నవంబరు 9 ప్రజలను ఉద్దేశించి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించారు. ‘‘ నిర్ణయం తర్వాత, ‘‘నవ భారత్‌’’ను నిర్మించేందు మనం సంకల్పించాలి. రండి అంతా కలిసి కొత్తగా మొదలుపెడదాం’’అని మోదీ పిలుపునిచ్చారు.

నిర్ణయానికి నేటితో మూడేళ్లు. అయితే, ఇప్పుడు ‘‘ మసీదు ఒకప్పుడు మందిరం’’అనే చర్చ నడుస్తోంది. ఒక్కసారిగా కోర్టుల దగ్గరకు పిటిషన్లు కుప్పలుతెప్పలుగా వస్తున్నాయి. ‘‘5,000ఏళ్లనాటి నాగరికతతో ప్రజలు ఆడుకుంటున్నారు’’అని రిరెలిజియస్ నేషనలిజంపై పరిశోధన చేస్తున్న షామ్సుల్ ఇస్లాం చెప్పారు.

ఒకవైపు యుక్రెయిన్-రష్యా యుద్ధం నడుస్తోంది. మరోవైపు కరోనావైరస్తో 62 లక్షల మంది మరణించారు. 2019లో ఒక్క వాయు కాలుష్యం వల్లే 17 లక్షల మంది భారత్లో మరణించారు. వాయు కాలుష్య మరణాల్లో భారత్ మొదటి స్థానంలో ఉంది.

నేడు భారత్ను తీవ్రమైన ఆర్థిక, సామాజిక సమస్యలు వెంటాడుతున్నాయి. మరోవైపు అంతర్జాతీయ సమస్యలు కూడా వచ్చిపడుతున్నాయి. కానీ, హిందూ-ముస్లింల ఘర్షణలు, ఎవరు ఎన్ని ఆలయాలను ధ్వంసం చేశారు? 400, 500, 600 లేదా వెయ్యి ఏళ్ల క్రితం ఏం జరిగింది? లాంటి అంశాల చుట్టూ చర్చలు జరుగుతున్నాయి

 


 

 

 

 

 

 

 

 

 



మే 12 బీజేపీ అధికార ప్రతినిధి అనిలా సింగ్ ఒక ట్వీట్ చేశారు. ‘‘ఇది సమాధి, ప్యాలస్‌‌గా ఎలా మారింది తమ్ముడు?’’అని ఆమె ప్రశ్నించారు. తాజ్మహల్ ఫోటోను కూడా ఆమె ట్వీట్ చేశారు.

‘‘ప్రాథమిక హక్కులు కేవలం మైనారిటీలకేనా? మెజారిటీలు దీని గురించి మాట్లాడితే, మతపరమైన హింసను రెచ్చగొట్టినట్లా?’’అని ఆమె ప్రశ్నించారు


 

 

 

 

 


 


మరోవైపు జ్ఞాన్వాపి మసీదులో శివలింగం బయటపడిందనే విషయాన్ని చెబుతూ #GyanvapiTruthNow హ్యాష్ట్యాగ్తో ఉత్తర్ ప్రదేశ్ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య ఒక ట్వీట్ చేశారు. ‘‘నిజాన్ని ఎంతకాలం దాస్తారు? ఏదో ఒకరోజు అది బయటకు వస్తుంది. ఎందుకంటే నిజం అంటే శివుడే’’అని ఆయన ట్వీట్ చేశారు

 




 

 

 

 

 

 

 

 ఫొటో సోర్స్, FACEBOOK

ఫొటో క్యాప్షన్,

ప్రతాప్ భాను మెహతా

జ్ఞాన్వాపితో చర్చ

ప్రస్తుతం కాశీలోని జ్ఞాన్వాపి మసీదు చుట్టూ చర్చ జరుగుతోంది. ఒకప్పుడు ఇది మసీదు అని చెబుతున్నారు.

బ్రిటిష్ లైబ్రరీలో విశ్వనాథ్ దేవాలయం ఫోటోతోపాటు దీనిపై వివరాలు కూడా ఇచ్చారు. 17 శతాబ్దంలో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు దేవాలయాన్ని ధ్వంసం చేసినట్లు పేర్కొన్నారు. దేవాలయాన్ని ఇందౌర్కు చెందిన అహిల్యా బాయి హోల్కర్ పునర్నిర్మించారు.

‘‘కాశీ, మథుర దేవాలయాలను ఔరంగజేబు ధ్వంసం చేయించారు. ఆయన ఆదేశాలపైనే ఇక్కడి దేవాలయాలను ధ్వంసం చేశారు. అయితే, ఆయన ఒకవైపు దేవాలయాలను ధ్వంసం చేసినప్పటికీ, మరోవైపు చాలా ఆలయాలకు ఆయన నిధులు మంజూరు చేశారు. ఆయన భారీగా విరాళాలు ఇచ్చారు’’అని చరిత్రకారుడు హర్బంశ్ ముఖియా చెప్పారు.

అయితే, చరిత్రలో సంక్లిష్టతను నేడు వివరించడం చాలా కష్టం. అలాంటి పరిస్థితుల్లో చరిత్రలో ఇలా జరిగింది.. ఇప్పుడు ఇలా చేయాలి.. అని చెప్పడం ఎంతవరకు సమంజసం? దీని వల్ల ఏం వస్తుంది?

 



 

 

 

 

 

 

 


 

 

ఫొటో సోర్స్, Getty Images

చరిత్రను తవ్వుకుంటే..

‘‘చరిత్రను తవ్వుకోవడం ద్వారా మనం ఏం సాధిస్తాం అనే విషయాన్ని మనం ఒకసారి ఆలోచించుకోవాలి’’అని రచయిత, ప్రొఫెసర్ పురుషోత్తం అగర్వాల్ వ్యాఖ్యానించారు.

‘‘చరిత్ర ఎప్పుడూ అంత అందమైనది కాదు. కానీ, ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదగాలనే భారత్లాంటి ప్రజాస్వామ్య దేశం ఇలా చరిత్రను తవ్వుకునేందుకు తన శక్తిని ధారపోయకూడదు’’అని టైమ్స్ ఆఫ్ ఇండియా ఒక సంపాదకీయాన్ని ప్రచురించింది.

‘‘ఇప్పటికే భారత్లో చాలా మతపరమైన ఉద్రిక్తతలు చోటుచేసుకుంటున్నాయి. ఇలాంటి సమయంలో మసీదు ఇదివరకు దేవాలయం అనే చర్చతో పరిస్థితులు మరింత దిగజారుతాయి’’అని కథనంలో వ్యాఖ్యానించారు.

జ్ఞాన్వాపీ మసీదు వ్యవహారం సుప్రీం కోర్టు వరకు వెళ్లినప్పుడు కూడా ‘‘దిగువ న్యాయస్థానాలకు అర్థమయ్యేరీతిలో సుప్రీం కోర్టు చెప్పాలి. ఇలాంటి కేసులు విచారణ చేపట్టాలని ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ను అనుసరించాలని సూచించాలి. చట్టప్రకారం నడుచుకోకపోతే, సహించబోమని స్పష్టం చేయాలి’’అని కూడా టైమ్స్ ఆఫ్ ఇండియాలో కథనం ప్రచురించారు.

ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ 1991 ప్రకారం.. 1947 ఆగస్టు 15 సమయంలో ఆయా ప్రార్థనా స్థలాల్లో ఏయే మతాలను అనుసరిస్తున్నారో తర్వాత కూడా మతాలనే అనుసరించాలి.

‘‘అయోధ్య తీర్పు తర్వాత, కాశీ, మథుర దేవాలయాలపై చర్చ జరుగుతోంది. ఎందుకంటే మెజారిటీల చేతిలో ఇప్పుడు అధికారం ఉంది’’అని చరిత్రకారుడు ప్రతాప్ భాను మెహ్తా వ్యాఖ్యానించారు.

 



 

 

 

 

 

 

 

 

ఫొటో సోర్స్, RSTV

ఫొటో క్యాప్షన్,

డీఎన్ ఝా

‘‘ ప్రార్థనా స్థలాలను వెనక్కి తీసుకోవడం మతపరంగా మంచి పనికాదు. మన భక్తి భావం కాశీ విశ్వనాథ్ ఆలయం లేదా మథుర లోని దేవాలయంపైనే ఉండాలి. ఇక్కడ మసీదులను తొలగించాలని అనుకుంటే, హిందువుల చేతిలో అధికారం ఉంది కాబట్టే, వారు ఇలా చేస్తున్నారని మైనారిటీలు భావిస్తారు’’అని ఆయన రాసుకొచ్చారు.

‘‘రీక్లైమ్ టెంపుల్స్’’ పేరుతో రచయిత విమల్ వీ ఒక పుస్తకం రాశారు. ‘‘ముస్లింలు లక్షల కొద్దీ హిందూ దేవాలయాలను కూలదోశారు. సైద్ధాంతికంగా తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించేందుకు వారు అలా చేశారు’’అని ఆయన చెప్పారు.

‘‘అలా ఆక్రమించిన ప్రార్థనా స్థలాలను మళ్లీ వెనక్కి తెచ్చుకోవాలి’’అని విమల్ అన్నారు. దీని కోసం రీక్లైమ్ టెంపుల్ పేరుతో తాము ఒక స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేశామని, దీనితో రాజకీయ పార్టీకి సంబంధంలేదని ఆయన చెప్పారు. సోషల్ మీడియాలో ఇలాంటి సంస్థలు చాలానే మనకు కనిపిస్తాయి.

మరోవైపు మాజీ మంత్రి, బీజేపీ నాయకుడు కేఎస్ ఈశ్వరప్ప కూడా మొఘల్ పాలకులు 36,000 హిందూ దేవాలయాలను కూలదోశారని చెప్పారు. ప్రార్థనా స్థలాలను వెనక్కి తీసుకోవాలని ఆయన అన్నారు.

కొన్ని హిందూ సంస్థలు అయితే, ముస్లిం పాలకులు 60,000కుపైగా దేవాలయాలను ధ్వంసం చేశారని చెబుతున్నాయి. అయితే, చరిత్రకారులు డీఎన్ఝా, రిచర్డ్ ఏటన్ సమాచారం ప్రకారం కేవలం 80 హిందూ దేవాలయాలను మాత్రమే ధ్వంసం చేశారు.

‘‘మొత్తంగా 300 దేవాలయాలను ధ్వంసం చేశారని 60ల్లో పత్రికల్లో వార్తలు వచ్చాయి. తర్వాత రెండు మూడేళ్లకే ఇవి 300 నుంచి 3,000కు పెరిగాయి’’అని హర్బంశ్ చెప్పారు

 



 

 

 

 

 

 

 

హిందువులు చేసినప్పుడు?

భారత్లోని దేవాలయాలను కేవలం హిందూయేతర పాలకులు మాత్రమే ధ్వంసం చేశారని భావించకూడదు.

‘‘మొఘల్ పాలనకు ముందు కూడా రాజుల మధ్య వైరాల వల్ల దేవాలయాలు ధ్వంసమయ్యాయి’’అని చరిత్రకారుడు రిచర్డ్ ఏటన్ రాసుకొచ్చారు.

‘‘642లో పల్లవ రాజు నరసింహ వర్మన్.. చాలుక్యుల రాజధాని వాతాపిలో గణేషుడి విగ్రహాన్ని దోచుకెళ్లారు’’అని ఏటన్ వివరించారు.

‘‘ఎనిమిదవ శతాబ్దంలో రాజు లలితాదిత్యాపై బెంగాలీ సైన్యం దండెత్తింది. కశ్మీర్లోని రాజాదేవ్ విష్ణు వైకుంఠ విగ్రహాన్ని ధ్వంసం చేస్తున్నారనే ఆరోపణలే దీనికి కారణం’’అని ఏటన్ పేర్కొన్నారు.

హిందువులు కూడా దేవాలయాలను దోచుకెళ్లారని, దేవాలయాల్లోని విగ్రహాలను కూడా తీసుకెళ్లిపోయేవారని చరిత్రకారుడు హర్బంశ్ ముఖియా కూడా చెప్పారు.

‘‘కశ్మీర్ రాజు హర్ష అయితే, దేవాలయాల్లోని విగ్రహాలను దోపిడీచేసేందుకు ఒక అధికారిని కూడా నియమించారు’’అని ఆయన చెప్పారు.

‘‘9 శతాబ్దంలో రాష్ట్రకూట రాజు గోవింద్-3 కాంచీపురంపై దాడి చేశాడు. దీంతో బెంబెలెత్తిన శ్రీలంక రాజు సింహళ దేశాన్ని ప్రతిబింబించే విగ్రహాలు (బహుశా బుద్ధుడి విగ్రహాలు)ను పంపించాడు. విగ్రహాలను తన రాజధానిలోని శివుడి ఆలయంలో రాజు గోవింద్ ఏర్పాటుచేశాడు’’అని ఏటన్ రాసుకొచ్చారు.

 



వీడియో క్యాప్షన్,

కాశీ విశ్వనాథ్ ధామ్ను జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ

‘‘అదే సమయంలో పాండ్యుల రాజు శ్రీమర శ్రీవల్లభ్ శ్రీలంకపై దాడి చేశాడు. అక్కడి నుంచి బంగారంతోచేసిన బుద్ధుడి విగ్రహాన్ని దోచుకున్నాడు’’అని ఏటన్ పేర్కొన్నారు.

‘‘11 శతాబ్దంలో చోల రాజు రాజేంద్ర-1 తన రాజధానిని భిన్న ప్రాంతాల నుంచి దోచుకొచ్చిన విగ్రహాలతో అలంకరించాడు. చాలుక్య రాజ్యం నుంచి దోచుకొచ్చిన దుర్గ, గణేషుడి విగ్రహాలు కూడా దీనిలో ఉన్నాయి. మరోవైపు కళింగ నుంచి భైరవ్, భైరవి, కాళీ, తూర్పు చాలుక్యుల నుంచి నంది విగ్రహాలను కూడా ఆయన దోచుకున్నాడు’’అని ఏటన్ రాసుకొచ్చారు.

‘‘1460ల్లో ఒడిశాలోని సూర్యవంశ గణపతి రాజ్య స్థాపకుడు కపిలేంద్ర.. శివ, విష్ణు దేవాలయాలను ధ్వంసం చేసినట్లు చరిత్ర చెబుతోంది. చాలా ఘటనల్లో రాజులు కట్టించిన ఆలయాల్లోని విగ్రహాలను దండెత్తినవారు దోచుకెళ్లేవారు. ఇక్కడ హిందూ రాజులు కూడా దాడులు చేసేవారని గుర్తుపెట్టుకోవాలి’’అని ఏటన్ వివరించారు.

‘‘దేవాలయాలపై జరిగే దాడులను అప్పట్లో అధికార కేంద్రాలపై జరిగే దాడులుగా పరిగణించేవారు. ఎందుకంటే దేవాలయాలే అధికారాలకు కేంద్రంగా చెప్పేవారు’’అని హర్బంశ్ వివరించారు.

‘‘దేవాలయాలను కూడా కాపాడలేని వ్యక్తి రాజు ఎలా అవుతాడనే ప్రశ్నలు ఉత్పన్నం అయ్యేవి. మరోవైపు దేవాలయాల్లోని వజ్రాలు, బంగారం కూడా దాడులకు కారణం’’అని ఆయన చెప్పారు.

‘‘అయితే, ఎన్ని దేవాలయాలను ధ్వంసం చేశారో కచ్చితంగా చెప్పడం కష్టమే. కానీ, 12 నుంచి 18 శతాబ్దాల మధ్య దాదాపు 80 హిందూ ఆలయాలను ధ్వంసం చేసినట్లు ఆధారాలు చెబుతున్నాయి’’అని ఆయన ఏటన్ చెప్పారు. అయితే, కొంతమంది హిందూ జాతీయవాదులు 60,000కుపైగా ఆలయాలను ధ్వంసం చేశారని చెబుతున్నారు

 



 

 

 

 

 

 

 

 

ఫొటో సోర్స్, Getty Images

బౌద్ధ ఆరామాలను కూడా..

‘‘ఎగెనెస్ట్ గ్రైన్నోట్స్ ఆన్ ఐడెంటిటీ, ఇన్టోలెరెన్స్, హిస్టరీ’’ పేరుతో చరిత్రకారుడు డీఎన్ ఝా ఒక పుస్తకం రాశారు. దీనిలో బౌద్ధ స్తూపాలు, విహారాలు, ప్రార్థనా స్థలాలను బ్రాహ్మణ రాజులు దోచుకెళ్లడం గురించి ఆయన ప్రస్తావించారు. అయితే, ఈయన పుస్తకంతో చాలా మంది చరిత్రకారులు విభేదిస్తున్నారు.

‘‘పురాతన కాలంలో హిందువుల్లో కుల వ్యవస్థ, పెద్దపెద్ద యజ్ఞాల వల్ల చాలా మంది బౌద్ధంవైపు ఆకర్షితులయ్యారు. అయితే, దీన్ని కొందరు హిందూ రాజులు తమకు ముప్పుగా భావించేవారు. దీంతో బౌద్ధ ప్రార్థన స్థలాలపై దాడులు జరిగేవి’’అని ఝా తన పుస్తకంలో పేర్కొన్నారు.

‘‘ తర్వాత బౌద్ధులు కూడా తమను తాము కాపాడుకునేందుకు బుద్ధుడు.. విష్ణువు అవతారమేనని చెప్పుకొచ్చారు’’అని ఝా వివరించారు.

‘‘అశోకుడు బౌద్ధ మతాన్ని అనుసరిస్తే, అతడి కుమారుడు శివుడిని పూజించేవాడు. అతడు బౌద్ధ విహారాలను కూడా ధ్వంసం చేసినట్లు చరిత్ర చెబుతోంది’’అని ఝా పేర్కొన్నారు.

‘‘బౌద్ధులను హింసకు గురిచేసిన వారిలో పుష్యమిత్ర సుంగ ఒకరు. ఆయన చాలా బౌద్ధ స్తూపాలు, బౌద్ధ ఆరామాలను తగులబెట్టించారు. శిలాకోట్లోని పెద్ద సంఖ్యలో బౌద్ధులను ఆయన చంపించారు’’అని ఝా వివరించారు.

 


 


వీడియో క్యాప్షన్,

వారణాసి: మందిరం, మసీదు పక్కపక్కనే ఎలా నిర్మించారు?

‘‘పట్నాలోని బౌద్ధ విహారాలను కూడా పుష్యమిత్ర సుంగానే ధ్వంసం చేయించి ఉండొచ్చు’’అని ఝా రాసుకొచ్చారు.

మరోవైపు చైనా యాత్రికుడు హ్యూయాన్ సాంగ్ చెప్పిన సంగతులను ఉటంకిస్తూ ‘‘శివుడి భక్తుడైన రాజు మిహిర్కుల్ 1,600 బౌద్ధ స్తూపాలను, విహారాలను ధ్వంసం చేశారు. వేల మంది బౌద్ధులను హత్య చేశారు’’అని ఝా పేర్కొన్నారు.

‘‘ప్రఖ్యాత నలంద విశ్వవిద్యాలయం లైబ్రరీలను కూడా హిందూ అతివాదులు తగలబెట్టారు. కానీ, దీన్ని బఖ్తియార్ ఖిల్జీ తగ్గులబెట్టారని చెబుతారు. అసలు ఆయన అక్కడికి వెళ్లనేలేదు’’అని ఝా వివరించారు.

‘‘పూర్ణేశ్వర్, కేదారేశ్వర్, కాంతేశ్వర్, సోమేశ్వర్, అగ్నేశ్వర్ ఆలయాలను బౌద్ధారామాలను ధ్వంసం చేసి కట్టారని చెప్పడంలో ఎలాంటి సందేహమూలేదు’’అని ఝా వివరించారు.

అయితే, ఝా వాదనలు చాలా పక్షపాతంతో సందేహాలను రేకెత్తించేలా ఉన్నాయని దిల్లీ యూనివర్సిటీలోని బౌద్ధ అధ్యయన కేంద్రం మాజీ ప్రొఫెసర్ కేటీఆఎస్ సరావో చెప్పారు.

‘‘బ్రాహ్మణులు, బౌద్ధుల మధ్య విభేదాలున్న మాట వాస్తవమే. కానీ, రెండు వర్గాల మధ్య హింస చెలరేగిందని చెప్పడం సరికాదు. వేల మందిని హత్య చేశారని అంటున్నారు. కానీ, అలా జరిగి ఉండకపోవచ్చు’’అని ఆయన అన్నారు.

‘‘ డిక్లైన్ ఆఫ్ బుద్ధిజం ఇన్ ఇండియా’’ పేరుతో ప్రొఫెసర్ సరావో ఒక పుస్తకం రాశారు. ‘‘హింస జరిగి ఉండొచ్చు.. అయితే, అది స్థానికంగా లేదా చాలా స్వల్పంగా ఘర్షణలు ఉండేవి. భారీగా అయితే, లేవు’’అని ఆయన పుస్తకంలో పేర్కొన్నారు.

 


 


వీడియో క్యాప్షన్,

కాశీ-జ్ఞాన్వాపి వివాదమేంటి? దాని వెనుక ఉన్న చారిత్రక మూలాలేంటి?

నలంద వర్సిటీని బఖ్తియార్ ఖిల్జీనే ధ్వంసం చేయించాడని సరావో చెప్పారు. ‘‘అక్కడ బ్రాహ్మణ రాజులు అరాచకాలకు పాల్పడినట్లు ఎలాంటి ఆధారాలూ లేవు’’అని ఆయన వివరించారు.

అయితే, తమ మతానికి చెందనివారిపై హింసకు పాల్పడటం ఒక్క భారత్కు మాత్రమే పరిమితం కాదు. బౌద్ధంలో అహింసకి ప్రధాన పాత్ర ఉంటుంది. కానీ, శ్రీలంక, మియన్మార్లలో ఇతర మతాలకు చెందిన వారిపై అరాచకాలకు పాల్పడినట్లు వార్తలు వస్తున్నాయి.

పొరుగున్న పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్లో పరిస్థితులూ భిన్నంగా ఏమీలేవు. ఇస్తాంబుల్లో ఒకప్పటి చర్చి హయా సోఫియాను ప్రస్తుతం మసీదుగా మార్చేశారు. యూరప్లోనూ మతం పేరుతో యుద్ధాలు జరిగాయి.

కానీ నేడు భారత్లో సంక్లిష్టమైన చరిత్రను టీవీ చర్చల్లో తమకు అనుగుణంగా మలచుకుంటున్నారని హరివంశ్ ముఖియా చెప్పారు. ‘‘పాపులర్ హిస్టరీ చాలా తేలిక.. ప్రొఫెషనల్ హిస్టరీ చాలా కష్టం. కానీ, ప్రొఫెషనల్ హిస్టరీ పుస్తకాన్ని కేవలం 1,000 మంది మాత్రమే చదువుతారు. కానీ, టీవీ ఛానెళ్లను పది లక్షల మంది చూస్తారు. వెయ్యి మంది కోసం రాయడం చాలా కష్టం. కానీ, పది లక్షల మందిని చేరుకోవడం చాలా తేలిక’’అని ఆయన వ్యాఖ్యానించారు.

Source: BBC NEWS I తెలుగు