Friday, January 24, 2014

కంప్యూటర్ రంగంలో 'పవన'వికాసం

Published at: 25-01-2014 08:38 AM


ఆండ్రాయిడ్ వెర్షన్ పీసీని రూపొందించిన తిరుపతి యువతి
సీఈఎస్ 14లో టాప్ టెన్‌లో నిలిచిన హెచ్‌పీ స్లేట్ -21 ప్రొ
(ఆంధ్రజ్యోతి, తిరుపతి)

ప్రపంచ కంప్యూటర్ రంగంలో ఓ తెలుగు తేజం మెరిసింది. దిగ్గజ మైక్రోసాఫ్ట్ పెత్తనానికి చెక్‌పెట్టేలా ఆండ్రాయిడ్ పీసీని రూపొందించి ప్రపంచ ఎలక్ట్రానిక్ మార్కెట్‌లో సంచలనం సృష్టించింది. తిరుపతి పట్టణానికి చెందిన పవన పోలినేని.. హెచ్‌పీ స్లేట్ 21ప్రొ ఆల్-ఇన్-పర్సనల్ కంప్యూటర్‌ను డిజైన్ చేసి అంతర్జాతీయ యవనికపై తెలుగువారి సత్తా చాటారు. ఈమె తయారు చేసిన ఈ కంప్యూటర్ 2014లో టాప్ టెన్ ఉత్పత్తులో ఒకటిగా నిలవడం గమనార్హం. ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల ప్రదర్శనకు సంబంధించి లాస్‌వెగాస్‌లో ప్రతి ఏడాది వినియోగదారుల ఎలక్ట్రానిక్ షో (సీఈఎస్) నిర్వహిస్తారు. ప్రపంచంలోనే అతి పెద్దదిగా, ప్రతిష్టాత్మకమైనదిగా భావించే ఈ ప్రదర్శనలో సుమారు 1.50 లక్షల మంది ఎలక్ట్రానిక్ రంగ నిపుణులు పాల్గొంటారు. కొత్తగా తయారు చేసిన కొన్నివేల ఎలక్ట్రానిక్ వస్తువులను ప్రదర్శనలో ఉంచుతారు. ఇందులో భాగంగా ఈ నెల 7 వతేదీ నుంచి 10వ తేదీ వరకు అమెరికాలోని లాస్‌వెగాస్‌లో జరిగిన సీఈఎస్- 2014లో పవన డిజైన్ చేసిన హెచ్‌పీ స్లేట్ 21 ప్రొ సంచలనం సృష్టించింది. వ్యాపార వినియోగదారుల కోసం ఆమె డిజైన్ చేసిన ఈ పీసీ ఎలక్ట్రానిక్ రంగంలో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది.

తిరుపతిలో విద్యాభ్యాసం

పవన తన విద్యాభాసాన్ని తిరుపతిలోనే పూర్తి చేశారు. ఎస్వీయూ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ పూర్తి చేసి అమెరికాలోని టెక్సాస్ ఏ అండ్ ఎం యూనివర్సిటీలో ఎంఎస్ పూర్తి చేశారు. కొంతకాలం డెల్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిశారు. ప్రస్తుతం హెచ్‌పీ గ్లోబల్ మార్కెటింగ్ మేనేజర్‌గా టెక్సాస్‌లో విధులు నిర్వహిస్తున్నారు. పవన తల్లిదండ్రులిద్దరూ అధ్యాపకులే. తండ్రి పోలినేని రామకృష్ణ చౌదరి ఎస్వీ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పని చేసి రిటైరయ్యారు. తల్లి డాక్టర్ పి. అనసూయమ్మ చంద్రగిరి ప్రభుత్వ జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్‌గా పనిచేసి ఉద్యోగ విరమణ చేశారు. పవన భర్త ఫణిభూషణ్ గద్దె టెక్సాస్‌లోనే ఆయిల్ అండ్ గ్యాస్ ఇండస్ట్రీలో సీనియర్ అనలిస్టుగా పనిచేస్తున్నారు.

గురువులకు, తల్లిదండ్రులకు కృతజ్ఞతలు

ఎలక్ట్రానిక్ రంగంలో తాను ప్రపంచ స్థాయి గుర్తింపు పొందడానికి కారణమైన గురువులకు, తల్లిదండ్రులకు పవన కృతజ్ఞతలు తెలిపారు. తను విద్యాభ్యాసం చేసిన ఎస్వీ యూనివర్సిటీ క్యాంపస్ స్కూలు, ఎస్వీ ఇంజనీరింగ్ కాలేజీ అధ్యాపకుల కృషి, తన తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఈ స్థాయికి ఎదిగానని ఆమె తెలిపారు. తిరుపతి మహిళగా తను సాధించిన ఈ విజయం రాష్ట్ర యువతకు స్పూర్తి కలిగించాలని పవన ఆకాంక్షించారు.

బిజినెస్ కస్టమర్స్ కోసం తక్కువ ధరలో ఆండ్రాయిడ్ సాప్ట్‌వేర్‌తో 21.5 అంగుళాల స్క్రీన్‌తో ఈ ఆల్ ఇన్ వన్ పిీసీని తయారు చేశారు. ఇప్పటి వరకు మైక్రోసాఫ్ట్ ప్లాట్ ఫాంపై క్రోమ్ ఆపరేటింగ్ సిస్టమ్ పనిచేస్తూ వచ్చింది. హెచ్‌పీ స్లేట్ 21ప్రొ రంగ ప్రవేశంతో ఆండ్రాయిడ్ ఆపరేషన్ సిస్టమ్స్‌తో కూడా పనిచేయనుంది.హెచ్‌పీ మార్కెటింగ్ అధినేతగా పవన పరిచయం చేసిన కంప్యూటర్ హెచ్.పి స్లేట్ 21ప్రొ ఆల్ ఇన్ వన్ 21.5 అంగుళాల స్క్రీన్‌తో ఫుల్ హై స్పీడ్ డెఫినిషన్‌తో పనిచేస్తుంది. ఐపీఎస్ టచ్ స్క్రీన్ కలిగి ఉంటుంది. బిజినెస్ కస్టమర్లు ఎక్కువగా వినియోగించే సిట్రిక్స్ సాఫ్ట్‌వేర్ కంపెనీ భాగస్వామ్యంతో ఆండ్రాయిడ్ ఆఫీస్ సాఫ్ట్‌వేర్‌ను ఇందులో అమర్చారు. సుమారు పది లక్షలకు పైగా యాప్స్ ఈ సిస్టమ్ ద్వారా లభ్యమవుతాయి. 4.3 ఆండ్రాయిడ్‌పై నడుస్తుంది. క్వాడ్ కోర్ ప్రాసెసర్, హెచ్.డి వెబ్‌క్యామ్, 2జి.బి ర్యామ్, 60 జీబి మెమరీలు దీనిలో లభిస్తాయి.అమెరికన్ మార్కెట్‌లో దీని ధర కీబోర్డు, మౌస్‌తో కలిపి 399 అమెరికన్ డాలర్లు (భారతీయ కరెన్సీ ప్రకారం.. సుమారు రూ. 25 వేలు)గా నిర్ణయించారు.



No comments: