Showing posts with label వేరు పడడమే నేటి విజ్ఞత. Show all posts
Showing posts with label వేరు పడడమే నేటి విజ్ఞత. Show all posts

Tuesday, October 29, 2013

వేరు పడడమే నేటి విజ్ఞత - వెలిచాల జగపతిరావు

Published at: 30-10-2013 00:20 AM

విభజనకు ఒప్పుకోండి. తెలంగాణతో ఘర్షణ ఆపండి. కేంద్రం ఇస్తున్న హామీలను స్వీకరించండి. ఆంధ్ర ప్రాంతంలోని కోట్లాది ప్రజల సౌకర్యం కోసం అన్ని హంగులతో కూడుకున్న కొత్త రాజధాని ఎంతైనా అవసరం. వెనుకబడ్డ ప్రాంతాల అభివృద్ధికి ప్యాకేజీ అవసరం. పెద్ద పెద్ద నీటిపారుదల నిర్మాణానికి కేంద్ర సహాయం అవసరం. విజ్ఞత చూపండి. రానిది-మీది కానిది కోరకండి.

తెలంగాణ ప్రజాపోరాట ఉద్యమం రాజకీయ నిరుద్యోగుల ఉద్యమమని ఆంధ్రులు అంటున్నారు. తమ ఉద్యమమేమో సమ-ఐక్యత మహోద్యమమట! తెలంగాణ రాజ్యం ఏర్పడితే దొరల రాజ్యం ఏర్పడుతుందని కుహనా రాజకీయ వేత్తలు పదే పదే వల్లిస్తూ పాశవిక అనుభూతిని పొందుతున్నారు.దొరలు ఎక్కడ? ఎప్పుడు? ఎంతమంది? ఎన్ని గ్రామాల్లో అత్యాచారాలు, అరాచకాలు చేశారు? ఆంధ్ర ప్రాంతంలో దళితులపై రాక్షసకాండను దేశం ఇంకా మరిచిపోలేదు. కారంచేడు, చుండూరు, లక్ష్మీపురం ఘటనలు మానవత పట్ల మహాపచారాలు కావా? ఆ అమానుషాలకు కారకులు ఏ కులాల వారు? వారి అఘాయిత్యాల చిట్టా విప్పమంటారా? వారు 'సత్యపూస'లైతే నక్సలైట్ల పేరు చెబితేనే ఎందుకు గజగజ వణికి పోతున్నారు? తెలంగాణ దృష్టిలో నక్సలైట్లు దేశభక్తులు. పేద ప్రజలకు వారు కొండంత అండ. తెలుగు ప్రజలు రెండుసార్లు దొరల పరిపాలనలో ఉన్నారు. స్వాతంత్య్రానికి ముందు ఉమ్మడి మద్రాసు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న రంగారావు బొబ్బిలి జమిందారు. ఆంధ్రప్రదేశ్‌కు సమర్థపాలన అందించిన జలగం వెంగళరావు కాంగ్రెస్ నాయకుడు. ఇరువురూ వెలమ దొరలే. 1960 దశకంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న జె.వి.నర్సింగ్‌రావు వెలమ. ఆంధ్రప్రదేశ్ పీసీసీకి ముగ్గురు వెలమలు నేతృ త్వం వహించారు. నిజాం వ్యతిరేక పోరాటంలో వెలమలది ముఖ్యపాత్ర. తెలంగాణ సాయుధ పోరాటంలో వెలమల పాత్ర శ్లాఘనీయం.

రాష్ట్ర శాసనసభలో మూడుసార్లు ప్రతిపక్ష నాయకులు వెలమ దొరలే. చెన్నమనేని రాజేశ్వరరావు ఆ బాధ్యతలను ఎంత సమర్థంగా నిర్వహించారో తెలుగువారికి తెలుసు. మావోయిస్టుల అగ్రనేత వెలమ సామాజికుడు. ఆంధ్రులకు ఆరాధ్యులైన పలనాడు బ్రహ్మన్న, బాలచంద్రుడు, బొబ్బిలి పాపారాయుడు వెలమలే. వెలమల పౌరుష గాథలను ఆంధ్రలో తమ పిల్లలకు ఉగ్గుపాలతో రంగరించి పోస్తారు.
అలనాటి బొబ్బిలి సంస్థానం వైశాల్యంలో నేటి ఒక జిల్లా అంత ఉంటుంది. దానికి నూరంతల ఎక్కువ బలమున్న విజయనగరం సంస్థానం, హైదరాబాద్ రాజ్యం, బుస్సీసేనాని నేతృత్వంలోని ఫ్రెంచ్ సైన్యం ఒకేసారి నాలుగు దిక్కులా చక్రబంధం వేసినా తలవంచని వీరులు బొబ్బిలి వెలమ దొరలు.

వెలమలు దుర్మార్గులా? శతాబ్దాల క్రితమే వారు కులవ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడారు. సహపంక్తి భోజనాలు చేశారు. దేవాలయాల్లో వారికి ప్రవేశం కల్పించారు. భారతదేశంలో ఏ జాతిలో లేని ఒక విశిష్ట ఆచారం వెలమ కుటుంబాల్లో ఉంది. వెలమఇంట్లో పెళ్ళికంటే ముందు ఒక దళితుని ఇంట్లో పెళ్ళి జరిపించి, వారి కాళ్ళవద్ద పడిన 'తల్వాలను' అనగా తలంబ్రాలను పంచలో కట్టుకుని తమ పిల్లల పెళ్ళిళ్ళు జరిపిస్తారు. వెలమ దొరల కోటలపైన ఒక హరిజనుడి విగ్రహాన్ని పూజిస్తారు. దీపం పెడుతారు. మీకు ఈ సంస్కారం వుందా? మీరు దళితులను గౌరవిస్తారా? బడుగు వర్గాలను చేరదీస్తారా? మీ ఉద్యమంలో నల్ల బట్టలు కట్టినవారు, గొంగళ్ళు వేసుకున్న వాళ్లు, పెయ్యిపైన సగం బట్టలు వేసుకున్న వారు ఒక్కరు కనబడరెందుకు? ఎందుకు పదే పదే మీరు ఒక కులాన్ని అవమానపరుస్తున్నారు? వెలమలకు దొర అన్నది ఒక గౌరవ పదం.

కూలీ పనిచేసే వెలమలను, పెండ తీసే పాలేరు వెలమను కూడా వారి కంటే తక్కువ కులాలవారు 'రామయ్య దొర పెండతీయవయ్యా' అంటారు. ఆంధ్రా ఉద్యమం ఎన్నో మలుపులు తిరిగింది. ఉద్యమాన్ని ఎగదోసిన నాయకులు కనుమరుగైపోయారు. ఒక చిరు ఉద్యోగి ఉద్యమంలో చేరి ఇంతై, ఇంతింతై, కొండంతై కేంద్ర మంత్రులను దిగిపొమ్మంటున్నాడు. మెడలు విరుస్తామంటున్నాడు. శాసనసభ్యులను, పార్లమెంటు సభ్యులను బజారులో నడవనీయమంటున్నాడు. ముఖ్యమంత్రితో చీకటి రాజకీయాలు చేస్తున్నాడు. కొత్త పార్టీ పెడతామని పగటికలలు కంటున్నాడు. ఆంధ్ర ఉద్యమానికి కర్త, క్రియ, కర్మ అంతా ఒక ఉద్యోగ సంఘం నాయకుడే. తెరచాటు ముసుగు నాయకుడు మాత్రం ముఖ్యమంత్రేనని అందరూ చెప్పుకుంటున్నారు.

ఆంధ్రుల విభజన వ్యతిరేక కిరికిరి మితిమీరి పోతున్నది. సమ-ఐక్యత ఒక విషపూరిత, స్వార్థపూరిత రాజకీయ పంథా. దానికి తలాతోకా లేదు. దానికి ఒక ఫిలాసఫీ లేదు. అది ఏకపక్షం. అపహర్తులు, దోపిడీదార్లు, దురాక్రమణదారులు, తెలంగాణరాజ్యాన్ని పంచమనడం హీనాతిహీనమైన, నీతి బాహ్యమైన ఆలోచన. దోచుకున్న దాన్ని లీగలైజ్ చేసుకోవడానికి చేసే కుటిలప్రయత్నం. ఉద్యమంలో అవలంబించిన పద్ధతులు జుగుప్సాకరం. బట్టలూడదీసుకొని ఆకులు కట్టుకొని చిం దులు వేయడం, ఒంటికాలు మీద మోకాళ్ళ మీద నడవడం, నడిరోడ్డు పైన చెమ్మాచెక్కా, వాలీబాల్, క్రికెట్ ఆటలు, రికార్డింగ్ డాన్సులు, చిన్న పిల్లలను పరేడ్ చేయించడం, మాటి మాటికి అంతర్యుద్ధం, సివిల్ వార్, యుద్ధ నగారా, నీటియుద్ధాలు చేస్తామని బెదిరింపులు. ఎక్కడ యుద్ధం చేస్తారట? ఎవరితోనట? తెలంగాణతోనా? తెలంగాణ గడ్డపైనేనా? అయితే ఏమైతుందో మీరే ఆలోచించుకోండి. తెలంగాణ లేకపోతే ఆంధ్ర ఎడారై పోతుందా? అదెట్లా? ఆంధ్రను భారతదేశపు ధాన్యాగారం అన్నారు కదా. భారతదేశానికి నిండు అన్నం గిన్నెగా భావించారు కదా. 1.30 కోట్ల ఎకరాల నీటి సాగుబాటు ఉన్న ఆంధ్ర, తెలంగాణ ముందు మోకరిల్లి అన్నమో రామచంద్ర అంటున్నది. బికారులమై పోతామంటున్నది. నమ్మశక్యం కావటం లేదు.

చెన్నై పట్టణానికి తాగునీరు ఇచ్చే ఉద్దేశంతో కేంద్రం నుంచి కేడబ్ల్యూసీ నుంచి కొంత నీరును అధికారికంగా కేటాయించారు. పేరు చెన్నైది, వాడకం మాత్రం ఆంధ్రాలో! అంతా అక్రమమే. తెలుగు గంగ పేరుతో ముడిపెట్టి నాలుగు కొత్త రిజర్వాయర్లకు నీరు తోడుకుంటున్నారు. వెలుగోడు రిజర్వాయర్-16.95; పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి రిజర్వాయర్ -17.75 ; సోమశిల-78; కొండలేరు-68 (సంఖ్యలన్నీ టీఎంసీలు). తెలంగాణకు ఉపయోగపడే గోదావరీ పరీవాహక నీరును 'రహదారి' చేశారు. 80 లక్షల ఎకరాలకు సరిపోయే నీరును కృష్ణకు తరలించే ప్రతిపాదన తెచ్చారు. ఆంధ్రకు మాత్రమే ఉపయోగపడే పోలవరం, దుమ్ముగూడెం ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టారు. ముంపు తెలంగాణది, నీరు ఆంధ్రాకు. ఏమి సమ-ఐక్యత? ఎవరి కొరకో ఈ 'ఐక్యత'?
ఆంధ్రతో తెలంగాణ కలయిక ఒక పీడన. ప్రతిరంగంలో పక్షపాతం, వివక్ష. అది ఒక నరకయాతన. సంఖ్యాబలం ఉన్న ఆంధ్ర రకరకాల స్వార్థపూరిత ఉద్యమాలు చేసి కావలసింది సాధించుకున్నది. తెలంగాణతో కలిసి ఉంటామని రెండు ఉద్యమాలు, తెలంగాణతో విడిపోతామని రెండు ఉద్యమాలు-తమకుకావలసిన ముఖ్యమంత్రులను ఉంచాలని, మార్చవద్దని రెండు ఉద్యమాలు.

తెలంగాణ ముఖ్యమంత్రులను మార్చమని రెండు ఉద్యమాలు. నీటికాడ, నిధుల కాడ, పదవుల కాడ, ఉద్యోగాల కాడ, విద్యలో, వైద్యంలో, ఉపాధిలో, కరువు నిధుల్లో, వరద నిధుల్లో, రోడ్ల కాడ, రైళ్ళ కాడ, కేంద్ర పదవుల్లో, రాష్ట్ర పదవుల్లో -అంతటా అన్యాయమే. దురాక్రమణే, పక్షపాతమే. 57 ఏళ్ళ ఉద్యమం ద్వారా తెలంగాణ రక్తసిక్తమైంది. నిరంతర పోరాటాలు చేసి అలసిపోయింది. ఈ దశలో భారతదేశ రాజకీయ పార్టీలు, సమాఖ్య సభ్యులు, ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం, భారతదేశ యావత్తు ప్రజానీకం తెలంగాణ గోసను చూసి విభజన తప్ప వేరే మార్గం లేదని తెలంగాణకు అండగా నిలిచారు. విభజన నిర్ణయం జరిగింది. ఆంధ్ర తిరిగి అలవాటు ప్రకారంగా ఉద్యమించింది, ఉద్యమం నకిలీది, ఉత్తుత్తది. అయినా సంఖ్యాబలంతో తెలంగాణ బిల్లును శాసనసభలో అడ్డుకుంటామని, పార్లమెంట్‌లో అడ్డుకుంటామని రాజకీయాలు చేస్తున్నారు.

తెలంగాణ ఓపిక నశించింది. మూడున్నర కోట్ల తెలంగాణకు కనువిప్పు కలిగింది. కేంద్ర ప్రభుత్వం, జాతీయ పార్టీలు, ప్రభుత్వాలు, ఫెడరల్ సమాఖ్య సభ్యుల హామీతో తెలంగాణ ఓపికతో నిరీక్షిస్తున్నది. డిసెంబర్‌లోగా తెలంగాణ నిర్ణయం జరగనివ్వకపోతే హైదరాబాద్ రాజధాని నగరంలో ఉమ్మడి రాష్ట్ర బోర్డు తిప్పేయటానికి తెలంగాణ యువత సంసిద్ధమౌతున్నది. నూరారైన, ఆరునూరైన; భూనభోంతరాలు ఏకమైనా, ఇటు సూర్యుడు అటు పొడిచినా తెలంగాణ విభజనను ఆపే శక్తి ఎవరికీ లేదని ఖరాఖండితంగా తెలంగాణ బహిరంగంగా చెబుతున్నది.

ఇక రాజధాని సంగతి - ఆంధ్రులు నిస్సిగ్గుగా, నిర్లజ్జగా, మానాభిమానాలు లేకుండా హైదరాబాద్ రాజధాని నగరం మీ అబ్బ సొమ్మా అని తెలంగాణను ప్రశ్నిస్తున్నారు. 1956 నుంచి నేటి వరకు హైదరాబాద్ అభివృద్ధి పైన, ఆంధ్ర ప్రాంతం ఒక నయాపైస పెట్టుబడి పెట్టలేదు. హైదరాబాద్ పట్టణ ఆలనాపాలనా, అభివృద్ధి అంతా తెలంగాణదే. త్రాగే నీరు తెలంగాణదే, పరిశ్రమలకు, ఇతర అవసరాలకు వాడే నీరు కూడా తెలంగాణదే. విద్యుచ్ఛక్తి తెలంగాణదే. దాదాపు 20వేల మంది జీహెచ్ఎంసీ ఉద్యోగుల జీతభత్యాలు తెలంగాణ భరిస్తున్నది. హైదరాబాద్ పట్టణ నిర్మాణానికి, నేటి విలువ ప్రకారంగా 50వేల కోట్లు రాష్ట్ర ఏర్పాటు సమయంలో మద్రాసు నుంచి విడిపోయి వచ్చిన ఆంధ్ర హైదరాబాద్ నగర విలువ కట్టలేదు. దాంట్లో భాగస్వామ్యానికి పెట్టుబడి పెట్టలేదు. అయినా హైదరాబాద్ మాదే అంటున్నారు. అది మీ అబ్బ సొమ్మా అంటున్నారు.

ఆంధ్ర ఉద్యమకారులు ప్రజలకు అవాకులు చవాకులు చెప్పి వారిని రెచ్చగొట్టి విభజన సమస్యను జటిలం చేయడానికి సర్వపన్నాగాలు పన్నారు. శాంతికి భంగం కలిగించారు. తెలంగాణ, ఆంధ్ర మధ్యన ఉన్న మర్యాదను భంగపరిచి తెలంగాణను నానా హింసలు పెట్టి భవిష్యత్తులో కలిసి ఉండటానికి అవకాశం లేకుండా విషబీజాలు నాటారు. ఢిల్లీ చుట్టూ పడిగాపులు కాస్తున్నారు. గడప గడపకు వెళ్ళి పిటీషన్లు ఇస్తున్నారు, కోర్టుకు పోయారు. అసెంబ్లీలో, పార్లమెంట్‌లో తెలంగాణ విభజన అడ్డుకుంటారట. కేంద్ర ప్రభుత్వాన్ని, జాతీయ నాయకులను, జాతీయ పార్టీలను బండబూతులు తిట్టి వారి విగ్రహాలను ధ్వంసం చేసి, మలినం చేసి, కాల్చి బొందపెట్టి వెకిలి డాన్సులు చేసారు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళ దగ్గరికే పోయి మీరు విభజన ఆపకపోతే మీ పార్టీలను బొందపెడతామంటున్నారు. భారత జాతి ఆంధ్రుల నడవడిని గమనిస్తున్నారు. వారు ఆంధ్రను ఒక ధూర్త, దుష్ట 'రోగ్' రాష్ట్రంగా చూస్తున్నారు.

ఆంధ్ర ప్రభుత్వాలు, ప్రజలు, ఆంధ్ర వ్యాపార వేత్తలు, తెలంగాణను గత 57 ఏళ్లుగా వలస ప్రాంతంగానే గుర్తించారు తప్ప సమ భాగస్వామ్యులుగా గౌరవించలేదు. తెలంగాణను ఒక వ్యాపార అడ్డాగా, వలస ప్రాంతంగా మార్చారు. చేతికందినంత దోచుకుతినడమే ప్రధాన లక్ష్యం. వారి వ్యాపారాలు అనేకం. సినిమా రంగం, హాస్పిటళ్లు, నర్సింగ్ హోమ్‌లు, సూపర్ బజార్‌లు, హోటళ్ళు, లాడ్జీలు, క్లబ్బులు, కాలనీలు, పట్టణం చుట్టూ 100 కి.మీ. వరకు భూములు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, లక్షలాది కోట్ల కాంట్రాక్టు పనులు, సారా వ్యాపారం, కార్ల, మోటారు సైకిళ్ళ ఏజెన్సీలు, బట్టల షాపులు, విద్యారంగం, స్కూళ్ళు, కాలేజీలు, పాలిటెక్నికులు, టి.వి. చానళ్ళు, పత్రికా రంగం, పెట్రోలు బంకులు, చెట్ల వ్యాపారం, లేబర్ అడ్డాలు, ట్రాన్స్‌పోర్ట్ బిజినెస్, లగ్జరీ బస్సులు, కోట్లాది విలువ చేసే అపార్టుమెంటులు... అంతా ఆంధ్ర మయమే. ఇన్ని వ్యాపారాలు చేస్తూ తెలంగాణను కొల్లగొడుతూ ఆంధ్ర ఉద్యమకారులు తెలంగాణపై అంతర్యుద్ధం చేస్తామంటున్నారు, సివిల్ వార్ చేస్తామంటున్నారు. నీటి యుద్ధం తప్పదంటున్నారు. యుద్ధం యుద్ధం అని గావుకేకలు పెడుతున్నారు, పిచ్చి కూతలు కూస్తున్నారు. యుద్ధం జరిగేది తెలంగాణ భూభాగంలోనే అని గమనించాలి. ప్రపంచ చరిత్రలో భూమి విడిచి సాము చేసిన వారు ఎవ్వరూ గెలువలేదు.

సామరస్యానికి, సహజీవనానికి తెలంగాణ ఎప్పుడూ సిద్ధమే. తెలంగాణ ఎప్పుడూ ఆంధ్ర చుట్టరికాన్ని స్వీకరిస్తుంది. ఆంధ్ర భాషను గౌరవిస్తుంది. తెలంగాణలో చిరకాలంగా నివసిస్తున్న ఆంధ్రులు మా అన్నదమ్ములే, అక్కచెల్లెల్లే. విభజనకు ఒప్పుకోండి. తెలంగాణతో ఘర్షణ ఆపండి. కేంద్రం ఇస్తున్న హామీలను స్వీకరించండి. ఆంధ్ర ప్రాంతంలోని కోట్లాది మంది సామాన్య ప్రజానీకం సౌకర్యం కోసం అన్ని హంగులతో కూడుకున్న కొత్త రాజధాని ఎంతైనా అవసరం. వెనుకబడ్డ ప్రాంతాల అభివృద్ధికి ప్యాకేజీ అవసరం. పెద్ద పెద్ద నీటిపారుదల నిర్మాణానికి కేంద్ర సహాయం అవసరం. విజ్ఞత చూపండి. రానిది-మీది కానిది కోరకండి.
- వెలిచాల జగపతిరావు
సీనియర్ రాజకీయ వేత్త, రచయిత, స్వాతంత్య్ర సమరయోధుడు

Source: Andhrajyothy