Showing posts with label వేల సంవత్సరాల నుంచి ఈ రోజు దాకా జీవించడమే. Show all posts
Showing posts with label వేల సంవత్సరాల నుంచి ఈ రోజు దాకా జీవించడమే. Show all posts

Thursday, November 21, 2013

చరిత్ర ఆయుష్షు పోస్తుంది

Published at: 22-11-2013 07:52 AM





తెలుగు చారిత్రక నవలా సౌధానికి నాలుగో స్తంభం లాంటి వాడు డాక్టర్ ముదిగొండ శివప్రసాద్. విశ్వనాథ సత్యనారాయణ, నోరి నరసింహ శాస్త్రి, అడవి బాపిరాజు తర్వాత ఆ ప్రక్రియలో అంతటి కృషి చేసిన వారు మరొకరు లేరు. శివప్రసాద్ ఇప్పటిదాకా రాసిన 83 పుస్తకాల్లో 20 చారిత్రక నవలలే. శ్రీపదార్చన, ఆవాహన, పట్టాభి, రెసిడెన్సీ, శ్రీలేఖ, శ్రావణి వంటి ఎన్నో చారిత్రక నవలలు సాంఘిక నవలలకు సరిసమానంగా పాఠకుల్ని అలరించి.. ఆయనకు ఎనలేని కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టాయి. రావూరి భరద్వాజకు అంకితంగా త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న 'వంశధార' అనే ఆయన నవలను పాకుడురాళ్లు-2 అనుకోవచ్చు. 'చారిత్రక నవలా చ క్రవర్తి'గా ప్రసిద్దులైన ప్రొఫెసర్ ముదిగొండ శివప్రసాద్ సాహితీ జీవన ప్రస్థానంలోని కొన్ని సంఘటనలే ఈ వారం 'అనుభవం'

"సముద్రానికీ సాహిత్యానికీ ఏమైనా సంబంధం ఉందా? అంటే ఉందనే చెబుతాను. నేను జన్మించింది ప్రకాశం జిల్లాలోని సముద్ర తీర ప్రాంతంలో ఉన్న ఆకులల్లూరు గ్రామంలో. మానవ సంబంధ, బాంధవ్యాల గురించి ఏమీ తెలియని ఆ వయసులో నాకు తెలిసిందల్లా మనసుతో సముద్రానికి ఉన్న అనుబంధమే. ఆ తరువాత నేను పెరిగింది మా తండ్రి గారి ఊరు తాడికొండలో. జ్ఞానపీఠ పురస్కార గ్రహీత రావూరు భరద్వాజ గారి ఊరు కూడా అదే. నాకంటే ఆయన 15 ఏళ్లు పెద్దవాడే అయినా ఆయనతో నాకు బాగా సాన్నిహిత్యం ఉండేది. ఆ తరువాత్తరువాత నేనూ, ఆయనా హైదరాబాద్‌కే రావడం వల్ల మా బంధం ఆయన జీవితకాలమంతా కొనసాగుతూనే వచ్చింది. అది నన్ను ఆయన రాసిన 'పాకుడు రాళ్లు' నవలకు మరో భాగం అనిపించే 'వంశధార' నవల రాసే దాకా నడిపించింది.

పాకుడు రాళ్లు-2
అది 1960ల ప్రాంతం. కృష్ణాపత్రికలో రావూరి భరద్వాజ నవల 'పాకుడు రాళ్లు' సీరియల్‌గా వస్తున్నప్పుడు నేను ఆ పత్రికలోనే పనిచేస్తున్నాను. సుబ్రహ్మణ్య శర్మగారు దానికి ఎడిటర్‌గా ఉంటే డెస్క్ వర్క్ అంతా నేనే చూసేవాణ్ని. ఆ నవలకు గాను ఆయనకు మేము ఇచ్చిన పారితోషికం వారానికి 10 రూపాయలే. న్యాయానికి 'వంశధార' అన్న నవలను భరద్వాజ గారే రాయాలి. ఆ విషయమే ఆయనతో అంటే "ఇప్పుడది నాతో కాని పని, నువ్వే రాయి'' అన్నారు. 'వంశధార' కూడా పాకుడు రాళ్లు నవలలాగే సినిమా రంగానికి సంబం«ధించిన జీవితాల్నే చిత్రిస్తుంది. ఇదీ పాకుడు రాళ్లు నవల చెప్పే జీవిత సత్యానికి సారూప్యమైనదే కానీ మరో రకంగా చూస్తే పూర్తిగా భిన్నమైనది. భరద్వాజ 'పాకుడు రాళ్లు' ఒక సినీ కథానాయిక ఉత్థాన పతనాల గురించి చెబితే, 'వంశధార' ఒక సినీరచయిత ఉత్థాన పతనాల గురించి చెబుతుంది.

భరద్వాజ ఈ పుస్తకానికి ముందుమాట కూడా రాశారు. పుస్తకాన్ని ఆయన చేతుల మీదుగానే విడుదల చేయాలనుకున్నాను. ఒక ఫంక్షన్ హాల్ కూడా బుక్ చేశాను. కానీ, ఈ లోగానే ఆయన వెళ్లిపోయారు. ప్రత్యక్షంగా ఆయన బాధలు నా బాధలు కాకపోయినా, పరోక్షంగా ఆయన బాధ లు నన్నూ కలచివేసేవి. ఆకలితో అలమటించిన రోజులు ఆయన జీవితంలో లెక్కలేనన్ని. భరద్వాజ గారి అర్థాంగి కాంతమ్మ గారు ఎంతో కాలం దాకా ఏ పేరంటానికీ రాలేదు. దానికి కారణం ఆమెకు మరో జత బట్టలు లేకపోవడమే. అంతటి గర్భదరిద్రం అనుభవించాడాయన. అయినా పేదరికం గురించి, దారిద్య్రం గురించి భరద్వాజ వ్యాఖ్యలు భిన్నంగా ఉండేవి. "దరిద్రం అంటే తిండి, బట్ట, గూడూ లేకపోవడ ం కాదు. దరిద్రం అంటే సమాజంలో తాను ప్రేమించే వారెవరూ లేకపోవడం, తనను ప్రేమించే వారు లేకపోవడం' అనేవారు. ఇవే మాటల్ని పాకుడు రాళ్లు నవలలోని చివరి సన్నివేశంలో మంజరి చేత అనిపిస్తాడు. జీవితాన్ని కాచి వడబోసిన మహానుభావుడాయన. అలాంటి అనుభవజ్ఞుల సాన్నిహిత్యం లభించడానికి మించిన సంపద జీవితంలో మరొకటి లేదన్నది నా ప్రగాఢ విశ్వాసం. ఆ సాంగత్యమే పాకుడు రాళ్లు-2 అనిపించే వంశధార నవల రాయడానికి తోడ్పడింది. అందుకే మన పిల్లా పాపలకు ఏం దక్కినా దక్కకపోయినా ఎక్కడో ఒక చోట, ఏదో ఒక దశలో పెద్దవాళ్ల సాంగత్యమైతే దక్కాలని నాకనిపిస్తుంది.

మలిచే వాడు మందలించడా?
1959లో కొంతకాలం సికింద్రాబాద్‌లోని వెస్లీ హైస్కూలో ్లటీచర్‌గా పనిచేశాను. ఆ సమయంలో ఒక ధనవంతుల అబ్బాయి మా స్కూల్లో 8 వ తరగతి చదివేవాడు. ఆ అబ్బాయి బొత్తిగా చదవడం లేదని ఒకసారి వాళ్ల క్లాస్ టీచర్ గట్టిగా మందలించాడు. ఆ విషయం తెలియగానే ఆ అబ్బాయి తండ్రి ఆగమేఘాల మీద మా స్కూలుకు వచ్చి ఆ టీచర్ మీద ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేశాడు. అందరి ముందు ఆ టీచర్ తమ పిల్లాడికి క్షమాపణ చెప్పాలన్నాడు. మా ప్రిన్సిపాల్ మరేమీ మాట్లాడకుండా, అతడు చెప్పిన ట్టే స్కూల్లోని మొత్తం విద్యార్థులను, మొత్తం టీచర్లందరినీ ఒక చోట చేర్చి వాళ్లందరి ముందు ఆ టీచర్‌తో ఆ కుర్రాడికి క్షమాపణ చెప్పించాడు. ఆ వెంటనే ఆ టీచర్ తన రూమ్‌లోకి వెళ్లి వెక్కి వెక్కి ఏడ్వడం నేను చూశాను. ఆ సంఘటన నన్ను తీవ్రంగా కలచివేసింది. జీవితాల్ని మలిచే వాడికి మందలించే హక్కు ఉండదా? ఆ పిల్లాడు ధనవంతుల బిడ్డ అయినంత మాత్రాన వాళ్ల కొమ్ము కాయాలా? మా టీచర్ చేసిన తప్పేమిటని మేనేజ్‌మెంట్ మాట వరసకైనా ఒక మాట అడగలేదు. విద్యా వ్యవస్థలు పూర్తిగా వ్యాపారాత్మకం అయిపోతే ఏమవుతుందో నాకా సంఘటన బలంగా చెప్పింది. ఆ స్కూలును వదిలేశాక లెక్చరర్‌గా, రీడర్‌గా, ప్రొఫెసర్‌గా 35 ఏళ్లు అధ్యాపక వృత్తిలోనే కొనసాగినా ఆ చేదు అనుభవం నన్ను వెంటాడుతూనే వ చ్చింది. ఇప్పటికి 50 ఏళ్లు గడి చినా ఆ సంఘటన నా కళ్లల్లో మెదులుతూనే ఉంది.

ఫలితానికి పలుముఖాలు
రాఘవేంద్రరావుగారు అన్నమయ్య తీయడానికి పదేళ్ల ముందే జంధ్యాల గారు సినిమా తీస్తానంటే అన్నమాచార్య మీద స్క్రిప్ట్ తయారు చేశాను. దానికి సంబంధించిన పాటలన్నీ రికార్డు అయ్యాయి. కానీ, ఆర్థిక పరిస్థితులేవీ అనుకూలించకపోవడంతో నిర్మాత ఆ ప్రయత్నం నుంచి విరమించుకున్నారు. నా మనసులో ఒక మహా స్వప్నంగా ఆవరించిన ఆ సినిమా ఊహ ఒక్కసారిగా గాజుమేడలా కూలిపోయింది. చాలాకాలం దాకా నేను ఆ దిగులు నుంచి బయటపడలేదు. పదేళ్ల పాటు ఎంతో కష్టపడి తయారు చేసుకున్న ఆ స్క్రిప్టు నిరుపయోగంగా ఉండిపోవడం ఎందుకని భావించి చివరికి ఆ సినిమా స్క్రిప్టును 'శ్రీ పదార్చన' నవలగా మలిచాను. దాన్ని తెలుగు విశ్వ విద్యాలయం వారు ఆ ఏటి ఉత్తమ నవలగా ఎంపిక చే శారు. సినిమా తీయలేనప్పుడు ఆ స్క్రిప్టు ఎందుకులే అనుకుని ఉంటే అది చెత్త బుట్ట పాలయ్యేది. దాన్ని నవలగా మలిచిన ఫలితంగా అది ఒక పురస్కారానికి పాత్రమయ్యింది. ఏ వస్తువుకైనా, ఏ కళా సృజనకైనా ఒకే ఒక్క ప్రయోజనం అంటూ ఉండదు. దాని మిగతా ప్రయోజనాలేమిటో తెలుసుకుంటే మరో రూపంలో దాన్ని ఉపయోగంలోకి తీసుకురావచ్చు. దానికోసం పడ్డ శ్రమను సార్ధకం చేసుకోవచ్చు అనిపించింది.

పునాదులు పదిలంగా
'భువన విజయం' పద్యనాటక ప్రదర్శనకోసం మా గురువు ఆచార్య దివాక ర్ల వెంకటావధానితో కలిసి ఎన్నో దేశాలు తిరిగాను. లాస్ ఏంజిల్స్, న్యూయార్క్, వాషింగ్టన్ ఇలా దాదాపు 20 చోట్ల భువన విజయం పద్యనాటక ప్రదర్శనలిచ్చాం. అందులో నాది తిమ్మరుసు పాత్ర. మన దేశంలో మాత్రం 'వీళ్లకు ఇదో పిచ్చి- ఈ చాదస్తం జీవితాంతం వీళ్లను వదలదేమో' అంటూ వెటకారంగా మాట్లాడిన వాళ్లే ఎక్కువ. అయినా మేమెప్పుడూ వెనుకడుగు వేయలేదు. ఒకరోజు శాన్‌ఫ్రాన్సిస్కోలో ఇచ్చిన నాటక ప్రదర్శనకు తెలుగు వారే కాదు, అమెరికన్లు కూడా పెద్దసంఖ్యలో వచ్చారు. పద్యం ఎత్తుకున్న ప్రతిసారీ వారు ఊగిపోవడం మమ్మల్ని తన్మయానికి గురిచేసింది. ప్రదర్శన అయిపోగానే తమ హర్షాతిరేకాన్ని 45 నిమిషాల స్టాండింగ్ ఒవేషన్... అంటే సీట్లలోంచి లేచి నిలబడి చప్పట్లు కొట్టడం ద్వారా వ్యక్తం చేశారు. ఇది ఆ దేశంలో వాళ్లు తెలిపే అతి పెద్ద అభినందనకు చిహ్నం. పుట్టిన చోట పునాదులు కదిలిపోతున్న ప్రక్రియకు మరో చోట ఎక్కడో నీరాజనాలు లభించడం చూస్తే ఆశ్చర్యం వేసింది.. మనసు ఆ్రర్దమైపోయింది. స్వదేశంలో పద్యం అనగానే పెదవి విరిచే పరిస్థితుల్లో ఉంటే దేశం కాని దేశంలో పద్యానికి అంత స్పందన రావడం నాకెంతో ఆనందాన్నిచ్చింది. ఎక్కడో ఏ దేశంలోనో మన పద్యానికి ఆదరణ ఉందని తెలిస్తే గానీ, మనమేమిటో మనకు తెలిసిరాదా? ఆలోచిస్తే ఒక్కోసారి మనల్ని మనం ఎక్కడో జారవిడుచుకుంటున్నామేమో అనిపిస్తూ ఉంటుంది. మన పునాదుల్ని మనమే పాతాళంలోకి వదిలేసి ఆ తర్వాతెప్పుడో నెత్తీ నోరు కొట్టుకుంటే ఒరిగేదేమీ ఉండదని నేననుకుంటాను.

కల్పన-సత్యం కలగలిస్తే....
ఆంధ్రభూమి వారపత్రిక ఎడిటర్ సి. కనకాంబరరాజు గారు ఒకసారి నాతో "గురువు గారూ. ఒక నవల రాసిస్తారా?'' అన్నారు. "తప్పకుండా ఇస్తాను'' అన్నాను. "యండమూరి వీరేంధ్రనాథ్ రాసిన 'తులసీ దళం' న వల త్వరలో ముగియబోతోంది. మళ్లీ ఆ స్థాయిలో సంచలనం సృష్టించే నవల ఏదైనా ఇవ్వండి'' అన్నారు. వెంటనే నేను "చారిత్రక నవల రాసిస్తా'' అన్నాను. దానికి ఆయన "చారిత్రక నవల ఎవ రు చదువుతారండీ, మంచి మంత్ర తంత్రాలతో ఉండే ఒక థ్రిల్లర్ నవల ఏదైనా ఇవ్వండి'' అన్నారు. నేను మొండికేశాను. "నేను చారిత్రక నవలే రాస్తా. ఆ నవల 'తులసీ దళం' కన్నా పది కాపీలు ఎక్కువ అమ్ముడుపోయేదిగా ఉంటుంది'' అన్నాను. చివరికి ఆయన "సరే'' అన్నారు. చేసిన వాగ్దానం మేరకు ఒక సవాలుగా తీసుకుని 'శ్రావణి' అనే నవల రాశాను. ఆ నవలకు ఆశించిన దానికి మించి పాఠకుల ఆదరణ లభించింది. అదే స్పూర్తితో రాసిన 'తంజావూరు విజయం' నవల మూడు లక్షల కాపీలు అమ్ముడు పోయి అది నన్ను అన్ని రకాలుగా నిలబెట్టింది. 'ట్రూత్ యీజ్ మోర్ స్ట్రాంగర్ ద్యాన్ ఫిక్షన్' అనే మాట మనం ఎప్పుడూ వింటున్నదే. ఏ రకంగా చూసినా కల్పన కన్నా వాస్తవికతే ఎక్కువ బలమైనది. అయితే ఈ చారిత్రక నవల అన్నది ట్రూత్‌నే ఫిక్షన్‌గా రాసే ఒక అద్భుతమైన ప్రక్రియ. ఇందులో రెండూ ఉన్నాయి. అందుకే దానికి జనాలను అలరించే శక్తి మిగతా ప్రక్రియలకన్నా ఎక్కువ.. ఇది నా అభిప్రాయం మాత్రమే కాదు. నేను రాసిన పలు నవలలతో ఇది రుజువయ్యింది కూడా.

చారిత్రక నవలలు చదివితే ఏమొస్తుంది? అంటూ కొందరు అడుగుతూ ఉంటారు. చారిత్రక నవలలు చదవడం అంటే వేల సంవత్సరాల నాటి కాలమాన పరిస్థితుల్లోకి మనం పయనించడమే. ఒక రకంగా మన ఆయుష్షు వేల సంవత్సరాలకు విస్తరించడమే. వేల సంవత్సరాల నుంచి ఈ రోజు దాకా జీవించడమే. ''
- బమ్మెర
ఫోటోలు: హరిప్రేమ్

Source: Andhra Jyothi