Showing posts with label సర్కారు జిల్లాలను. Show all posts
Showing posts with label సర్కారు జిల్లాలను. Show all posts

Wednesday, March 12, 2014

1940లో తిరిగి కొనుక్కుందామనుకున్నారు

Published at: 13-03-2014 00:35 AM

http://www.andhrajyothy.com/node/74574

దాదాపు 250 ఏళ్ల క్రితం కోస్తా ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలు నిజాం పాలనలో ఉండేవని, ఆ తర్వాత వాటిని నిజాం రాజులు బ్రిటిష్ వారికి అప్పగించారని ఇప్పుడు తెలుగువాళ్లందరికీ తెలుసు. అయితే1940లో మళ్లీ వాటిని హైదరాబాద్ స్టేట్‌లోకి తిరిగి తీసుకురావడానికి ఒక ప్రయత్నం జరిగిందనేది ఎక్కువ మందికి తెలియకపోవచ్చు. ఈ ప్రయత్నంలో ఎంఐఎం వ్యవస్థాపకుడు బహదూర్ యార్ జంగ్ చాలా కీలక పాత్ర పోషించారు. చారిత్రక ప్రాధాన్యమున్న ఆ ఘట్టాన్ని- 'ద ఫాల్ అండ్ రైజ్ ఆఫ్ తెలంగాణ' పుస్తకంలో- ప్రముఖ జర్నలిస్టు గౌతమ్ పింగ్లే వివరించారు.

చరిత్రను జాగ్రత్తగా తరచి చూస్తే- రెండు వేర్వేరు ప్రాంతాలను విలీనం చేయాలనే కోరిక వెనక అనేక ఉద్దేశాలు కనబడతాయి. హైదరాబాద్‌కు సంబంధించి- 'ఫమ్ ఆటోక్రసీ టు ఇంటిగ్రేషన్- పొలిటికల్ డెవలప్‌మెంట్స్ ఇన్ హైదరాబాద్ స్టేట్' అనే పుస్తకంలో ల్యూసిియా డి. బెనిచో ఈ అంశాలను చాలా నిష్పాక్షికంగా పేర్కొంటాడు. నవాబ్ బహదూర్ యార్ జంగ్ 1929లో ఎంఐఎంను స్థాపించాడు. ఆయన ఎంతో ఉత్సాహవంతుడు, ధైర్యవంతుడు. ఏడవ నిజాంతోనే కాకుండా కాంగ్రెస్‌కు చెందిన ఎం.నరసింగరావుతోను, హిందుమహాసభకు చెందిన ఇతర ప్రముఖులతోను నేరుగా చర్చలు జరపగలిగిన సామర్థ్యం ఉన్నవాడు. నాటి హైదారాబాద్ రాజకీయాలలో నిజాం, బహదూర్ జంగ్‌లిద్దరే ప్రధాన పాత్రధారులు. వీరిద్దరి జుగల్‌బందీ- 1944, జూన్ 25వ తేదీన జంగ్ హఠాత్తుగా మరణించేదాకా సాగింది. జంగ్ మరణించే సమయానికి అతని వయస్సు 39 సంవత్సరాలే. గతంలో నిజాం వద్ద ఉండి, ఆ తర్వాత బ్రిటిష్ వారి అధీనంలోకి వెళ్లిన ప్రాంతాలను తిరిగి కలిపేసుకోవాలని ఎంఐఎం కోరుకొనేది. 1766, 1778లో రెండో నిజాం తన అధీనంలో ఉన్న ఉత్తర సర్కారును (ప్రస్తుత కోస్తా ఆంధ్రప్రదేశ్‌ను) ఈస్ట్ ఇండియా కంపెనీకి ఏడాది ఐదు లక్షల రూపాయలకు అద్దెకు ఇచ్చాడు. 1800లో రాయలసీమ ప్రాంతాన్ని కూడా బ్రిటిష్ వారికి అప్పగించాడు. (అందుకే ఈ ప్రాంతాన్ని ఇప్పటికీ సీడెడ్ అని పిలుస్తారు). 55 ఏళ్ల తర్వాత మూడో నిజాంకు డబ్బు అవసరమొచ్చి కోస్తా జిల్లాలను ఈస్ట్ ఇండియా కంపెనీకి 1.6 కోట్ల రూపాయలకు విక్రయించాడు.
** *
1940 సెప్టెంబర్‌లో బహదూర్ జంగ్ ఈ ఒప్పందాలన్నింటినీ తిరగదోడాలని ప్రతిపాదించాడు. సర్కారు జిల్లాలను, సీడెడ్‌ను హైదరాబాద్ రాష్ట్రానికి తిరిగి అప్పచెబితే- బ్రిటిష్‌వారికి 4 కోట్ల పౌండ్లను చెల్లిస్తామని ప్రతిపాదించాడు. కోస్తా ఆంధ్ర, రాయలసీమలలో ఉన్న స్థానిక ముస్లిములు ఈ ప్రతిపాదనకు సమ్మతి తెలిపారు కాని తెలుగు మాట్లాడే హిందువులు మాత్రం ఈ ప్రతిపాదనను వ్యతిరేకించారు. ఆ సమయంలో బ్రిటిష్ వారికి డబ్బు అవసరం చాలా ఉంది. అప్పుడు బ్రిటన్‌ను జర్మన్ వాయుసేనలు చుట్టుముట్టి లండన్ వంటి నగరాలపై బాంబులు కురిపిస్తున్నాయి. జర్మనీ బ్రిటన్‌ను ఆక్రమించుకుంటుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అందువల్ల ఈ ప్రతిపాదన వారు అంగీకరించే అవకాశం ఉందనుకున్నారు. ఆ సమయంలో 1940 అక్టోబర్‌లో 'ది స్టేట్స్ పీపుల్' అనే కాంగ్రెస్ పత్రిక- 'ఆంధ్రదేశం ఫుట్‌బాల్‌కాదు ఎక్కడికి పడితే అక్కడికి తన్నటానికి. కొనుగోలు పేరుతో లేదా బహుమతి పేరుతో జరిగే ఈ బదిలీ చిన్న విషయం కాదు. 1.8 కోట్ల మంది ఆంధ్ర ప్రజల స్వేచ్ఛకు, వారి జీవితాలకు సంబంధించిన అంశం. ఒక్క రోజులో వారందరినీ ఒక చోట నుంచి పెకలించి, ప్రజాస్వామ్య జలాలతో తడవని బీడు నేలలలో పాతలేరు..' అని వ్యాఖ్యానించింది.
** *
బహదూర్ జంగ్‌కు, నిజాంకు ఇది భూమికి సంబంధించిన క్రయవిక్రయం మాత్రమే. 150 ఏళ్ల క్రితం నిజాం పూర్వీకులు ఈ ప్రాంతాలను ఈస్ట్ ఇండియా కంపెనీకి విక్రయించినప్పుడు ఎలా ప్రజల ఆకాంక్షలను పరిగణనలోకి తీసుకోలేదో ఇప్పుడూ అంతే. బ్రిటన్ చేస్తున్న యుద్ధానికి ఏడో నిజాం అప్పటికే భారీగా విరాళాలు ఇచ్చాడు. శత్రు సేనలను ఛిన్నాభిన్నం చేయటానికి ఒక యుద్ధ నౌకను (డిస్ట్రాయర్) అందించాడు (దీనికి హెచ్ఎంఏఎస్ నిజాం అని పేరు పెట్టారు). హైదరాబాద్ స్టేట్ నుంచి 50 వేల పౌండ్లు, తాను వ్యక్తిగతంగా మరో 5 లక్షల రూపాయలను కూడా విరాళంగా ఇచ్చాడు. నిజాం దగ్గర ధనం ఉంది. బ్రిటిష్ వారికి అది అవసరం.
** *
1942, జనవరి ఒకటవ తేదీన జాల్నాలో జరిగిన ఎంఐఎం 13వ వార్షిక సమావేశాలలో బహదూర్ జంగ్ 15 వేల మంది ప్రతినిధుల ముందు ఈ డిమాండ్‌ను మరొక సారి పునరుద్ఘాటించాడు. ఫిబ్రవరి 1వ తేదీన మద్రాసు నుంచి వెలువడే డక్కన్ టైమ్స్- 'బహదూర్ జంగ్ డిమాండ్‌ల పట్ల బ్రిటిష్ ప్రభుత్వం సానుకూలంగా ఉంది. ఈ మేరకు ఒక నోటిఫికేషన్ అతి త్వరలోనే వెలువడుతుంది' అని పేర్కొంది. ఈ సమయంలోనే (1942లో) మచిలీపట్నం జర్నలిస్టుల అసోసియేషన్- 'ఉత్తర సర్కారు జిల్లాల్లో భాగంగా ఉన్న మచిలీపట్నంలోని ఏ ప్రాంతాన్ని కూడా నిజాంకు ఎటువంటి పరిస్థితుల్లోను తిరిగి ఇవ్వకూడదు..' అని తీర్మానం చేసింది. ఈలోగా బ్రిటిష్ పాలకులే కోస్తా, రాయలసీమ ప్రాంతాలను హైదరాబాద్ స్టేట్‌కు తిరిగి ఇవ్వటానికి నిరాకరించటంతో ఆ వివాదం అంతటితో ఆగిపోయింది. బహదూర్ జంగ్ ప్రతిపాదనను- తెలుగు వారందరినీ ఒకే ప్రభుత్వం కిందకు తేవాలనే ప్రయత్నంగా కూడా మనం చూడవచ్చు. కాని 1939-42 మధ్య కాలంలో అది కోస్తా ఆంధ్ర, రాయలసీమ ప్రజలకు ఆమోదయోగ్యం కాలేదు. అయితే పదేళ్ల తర్వాత నిజాం తన రాజ్యాన్ని కోల్పోయిన తర్వాత- వీరే తెలంగాణాలో తమ ప్రాంతాల్ని విలీనం చేయటానికి ఉత్సాహంగా ముందుకొచ్చారు.

Source: ఆంధ్రజ్యోతి