Showing posts with label Democracy of coalition rather than majority government is the best option.. Show all posts
Showing posts with label Democracy of coalition rather than majority government is the best option.. Show all posts

Saturday, November 23, 2013

రాచరిక ప్రజాస్వామ్యం - (మేధో మథనం) జాహ్నవి

Published at: 24-11-2013 00:19 AM

నిజాములు, మొగలాయిలు, విజయనగర సామ్రాజ్యాల వంటి రాజ్యాల విధివిధానాలను తరచి చూడాల్సిన అవసరం లేకుండా, సిద్ధాంత పరంగా, కేవలం సైద్ధాంతిక, తర్క స్థాయిలో రాచరికాన్ని, ప్రజాస్వామ్యాన్ని పోల్చి చూసి ఎందులో ఏది మంచి, ఏది చెడు అనేది నిర్ధారించుకోవడం సాధ్యం, అవసరం కూడా. ఇప్పటికైనా సరైన విశ్లేషణ, అవగాహనల ద్వారా ప్రజాస్వామ్యాన్ని ప్రక్షాళన చేయడమో, లేక దాన్ని త్యజించి, ఇంకో కొత్త వ్యవస్థను నిర్మించుకోవడమో విజ్ఞుల లక్ష్యం కావాలి.

కాలం అనంతమైనది. అందులో మనిషి జీవితం కూడా అరవై-డెబ్బై ఏళ్ళ పాటు సాగుతుంది. తన జీవితకాలంలో తీసుకునే నిర్ణయాలు తన తర్వాత వచ్చే తరాల మీద ప్రభావం చూపుతాయి. తన పూర్వ తరాల నిర్ణయాలు, వాటి ప్రభావాలు, పర్యవసానాలను నిరంతరం విశ్లేషిస్తూ, జరిగిన తప్పులను సరిదిద్దాల్సిన బాధ్యత కూడా వర్తమాన మనిషి మీద ఉంటుంది. అట్టి బాధ్యతలను గుర్తించేవారు, నిర్వర్తించేవారు సమాజంలో కొద్దిమందే ఉంటారు, అందరూ ఉండరు. మెజారిటీ వ్యక్తులు అవసరం కొద్దీ కావచ్చు, వ్యక్తిగత ప్రవృత్తి మేరకు కావచ్చు, ఏ పూటకాపూట గడిచిపోతే చాలు, మిగతా విషయాలు మనకెందుకులే అనుకుంటూ గడిపేస్తారు. అటువంటి మెజారిటీ జన సామాన్యాల చేతుల్లో సమాన ఓటుహక్కు పెట్టడం వల్ల జరిగే అనర్థాలకు వర్తమాన, భావితరాలన్నీ గురికావలసి వస్తున్నాయి. కాబట్టి ఈ విధానంపైన పునరాలోచించడం అవసరం.

చిన్న, పెద్ద రూపాల్లో వేలాది సంవత్సరాలు ప్రపంచవ్యాప్తంగా రాచరిక వ్యవస్థ రాజ్యమేలింది. ప్రజాస్వామ్య వ్యవస్థ వయసు కేవలం వందేళ్ళే. 1914లో మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమయ్యే నాటికి అమెరికా, స్విట్జర్లాండు తప్ప ఇంకెక్కడా స్థిరమైన గణతంత్ర ప్రజాస్వామ్య వ్యవస్థ లేదు. మొదటి ప్రపంచ యుద్ధంలో తనకు అవసరం లేకపోయినా అమెరికా అడుగుపెట్టడంతో ప్రపంచ రాజకీయ ముఖ చిత్రం మారిపోయింది. ఆస్ట్రియా-హంగరీ, టర్కీ, జర్మనీ, (ప్రష్యా), రష్యా సామ్రాజ్యాలు కుప్పకూలిపోయి ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. మిగిలిన చిన్నచిన్న రాజ్యాలు కూడా క్రమేపీ ప్రజాస్వామ్య ప్రభుత్వాలకు దారివదిలి, రెండో ప్రపంచ యుద్ధానంతర కాలానికి అమెరికా కోరుకున్న, అమెరికా ప్రభావిత, అమెరికా ఆధారిత ప్రజాస్వామ్య ప్రభుత్వాలు అన్ని ఖండాల్లోనూ ఏర్పడ్డాయి. దీన్నుంచి తూర్పు యూరోపులో ఏర్పడ్డ కమ్యూనిస్టు ప్రభుత్వాలు మినహాయింపు. గత వందేళ్ళలో అటు కమ్యూనిజం, ఇటు ప్రజాస్వామ్యం పేరుతో విస్తరిస్తున్న సోషలిస్టు ప్రభుత్వాల పనితీరు, ప్రజాజీవితం, నైతిక విలువల మీద వాటి ప్రభావం విశ్లేషించుకోవలసిన అవసరముంది. ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో సమాజం కారు చీకట్లోకి ప్రయాణిస్తుందేమోననే భయాందోళనలను తేలిగ్గా కొట్టిపారేయలేం.

గెలిచిన వాళ్ళే చరిత్ర రాస్తారు. కాలక్రమేణా అందరితోనూ ఆ చరిత్రనే నమ్మిస్తారు. అమెరికా తాను ఆచరిస్తున్న ప్రజాస్వామ్య విలువలను, పాలనా విధానాలను ప్రపంచం మొత్తం మీద రుద్దుతోంది. మాకొద్దు మొర్రో అంటున్న మధ్యప్రాచ్య దేశాల్ని కూడా వింటే రాయబారం లేకపోతే యుద్ధం అన్న ప్రాతిపదికపై కబళిస్తోంది. ఈ రోజున అమెరికా ఆర్థిక, ఆయుధ శక్తి ముందు నిలబడగల దేశం ఏదీలేదు. ఈ ఆధిపత్యం ఎంతోకాలం కొనసాగకపోవచ్చు కానీ ప్రస్తుతానికిదొక వాస్తవం. ప్రజాస్వామ్యం అంత గొప్ప వ్యవస్థ అయితే, ప్రపంచ వ్యాప్తంగా ఇన్ని సంక్షోభాలెందుకు? ప్రతి దేశంలోనూ ఇన్నిన్ని సమస్యలెందుకు? అసలు రాచరికం నుంచి ప్రజాస్వామ్యంలోకి మారడాన్ని అభ్యుదయం క్రింద చూడాలా? లేక అది తిరోగమనమా? ప్రజాస్వామ్యమనే ఆలోచనలోనే ఎక్కడో లోపం ఉందా? లేక కేవలం ఆచరణలోనే తప్పు జరిగిందా? ఈ పొరబాట్లను సహజమైనవిగా, తాత్కాలికమైనవిగా భావించాలా? లేక ప్రజాసామ్య విధానంలో వ్యవస్థీకృతంగా అంతర్లీనంగా ఉన్న లోపాలు కాలక్రమేణా దాన్ని డొల్ల చేస్తూ, త్వరలోనే కుప్పకూలుస్తాయా?
ఇటువంటి ప్రశ్నలను ఎదుర్కోవడానికి గానీ, ఇటువంటి చర్చనే అంగీకరించడానికి గానీ ప్రజాస్వామ్య వాదులకు చాలా అసౌకర్యంగా ఉంటుంది. కానీ కేవలం వందేళ్ళ క్రితం రాచరిక వ్యవస్థ సమర్థకులు కూడా రాచరికానికి ప్రత్యామ్నాయముందనే భావనలనే దగ్గరికి రానిచ్చేవారు కాదు కావచ్చు. ఈ చర్చ అవసరమని అనిపించడానికి కారణాలున్నాయి.

రాచరిక వ్యవస్థలో లిఖిత రాజ్యాంగాలుండేవి కావు. అలిఖిత, అప్రకటిత సహజ న్యాయ సూత్రాలు అమలులో ఉండేవి. సహజ న్యాయం, ధర్మాలు రాజు కంటే ముందు పుట్టినవని, రాజు, ప్రజలు అందరూ నమ్మేవారు, రాజులు కూడా వాటికి కట్టుబడి ఉండేవారు. అలా లేకుండా తనకిష్టమొచ్చిన న్యాయాన్ని అనుసరిస్తే తన పీఠానికి, ప్రజలను పాలించే తన సార్వభౌమాధికారానికి ఎసరు వస్తుందని రాజులకు తెలుసు. అలా ఒక విధంగా అప్పటికే వాడుకలో ఉన్న న్యాయ, ధర్మాలను అమలు చేయడం వరకే రాజుల విధిగా ఉండేది. అంతే తప్ప కొత్త న్యాయాలను, చట్టాలను సృష్టించడం వాళ్ళ పని కాదు. ఇంకోవైపు ప్రజాస్వామ్య వ్యవస్థలలో దాదాపు అన్ని దేశాలకూ లిఖిత రాజ్యాంగాలున్నాయి. అక్కడ రాజ్యం న్యాయాన్ని అమలు చెయ్యడమే కాక, న్యాయాన్ని, న్యాయ సూత్రాలను, చట్టాలను తయారుచేసే అధికారాలు కూడా దఖలు పర్చుకుంది. మొదట్టో సహజన్యాయ, ధర్మాలను గుర్తించినప్పటికీ, కాలక్రమేణా, ప్రజాస్వామ్య వ్యవస్థ నిర్మాణంలోనే ఇమిడి ఉన్న అంతర్గత చలన సూత్రాల కారణంగా ఆ సహజ న్యాయ, ధర్మాలు పూర్తిగా నిర్లక్ష్యానికి గురయ్యాయి. అమెరికా మొదలుకొని అన్ని దేశాల్లోనూ జరిగిందదే. దీని వల్ల న్యాయ, ధర్మాలకు స్థిరత్వం కోల్పోయి, ఏ రోజు ఏ కొత్త చట్టం ద్వారా మానవ సంబంధాలు, ఉత్పత్తి ప్రయత్నాలలో ఏది నిషేధించబడుతుందో, ఏది బలవంతాన రుద్దబడుతుందో తెలియని అనిశ్చిత పరిస్థితి సర్వదా నెలకొంటోంది. ఇది మనిషి నైతికత మీద, వ్యక్తిగత బాధ్యత మీద తీవ్రమైన దుష్ప్రభావం చూపుతోంది.

రాచరికాలు అంతరించి పోయేవరకు డబ్బు (రూపాయి) విలువ బంగారం, వెండి లాంటి ద్రవ్యాలతో ముడిపడి ఉండేది. రాజులు తమ కిష్టమైనట్లుగా రూపాయి విలువ మార్చే అధికారం గానీ, అవకాశం గానీ ఉండేది కాదు. రూపాయి విలువలను రాజులు, రాజ్యాలు నీరుకార్చకూడదనేది వాడుకలో ఉన్న ప్రాచీన న్యాయం. దాన్ని, కొన్ని తాత్కాలిక తుగ్లక్ చేష్టలు మినహా, రాజులందరూ గౌరవించేవారు. రాచరికపు అంతం, రూపాయి, డాలర్ లాంటి అన్ని కరెన్సీల పతనం దాదాపు ఒకేసారి జరిగాయి. మొదట ఇంగ్లండు, తర్వాత 1913లో అమెరికా ఫెడరల్ రిజర్వు బ్యాంకుల హయాంలో పాక్షిక లేదా ఆంశిక లేదా భాగహారిక (ఊట్చఛ్టిజీౌn్చజూ) రిజర్వు బ్యాంకింగ్ శకం మొదలైంది. మొదట్లో పాక్షికంగాను, తర్వాత పూర్తిస్థాయిలో రూపాయి, డాలర్ వలువలకు బంగారం లాంటి ద్రవ్యాలతో గల సంబంధాన్ని తుంచేశారు. ఇదంతా ప్రజాస్వామ్య వ్యవస్థలు రాసుకున్న రాజ్యాంగాలను తమకిష్టమొచ్చినట్టు వ్యాఖ్యానించుకోవడం ద్వారా, లేక సవరించుకోవడం ద్వారా సమర్థించుకున్నాయి. అలా, సంపద సృష్టితో సంబంధం లేకుండా గాల్లోంచి డబ్బును సృష్టించడం మొదలైంది. అలా సృష్టించిన డబ్బును ఆశ్రిత వర్గాలకు పంచడం సహజ న్యాయ, ధర్మాలకు విరుద్ధమైనా, రాజ్యాంగ బద్ధం కాబట్టి ఎవరూ వ్యతిరేకించే వీలు లేకుండా పోయింది. ఆశ్రిత వర్గాలు అత్యంత పేద ఓటర్లు కావచ్చు, అత్యంత ధనిక పారిశ్రామిక వేత్తలు కావచ్చు. ఈ డబ్బు సృష్టి వల్ల అసలు జరిగేదేమిటంటే, అనాశ్రిత ప్రజలు కష్టపడి సంపాదించి, దాచుకున్న, లేక పెట్టుబడి పెట్టిన డబ్బు, సంపదల విలువ తగ్గిపోతుంది. ఇది కష్టజీవుల ప్రమేయం లేకుండా, వాళ్ళకసలు తెలియనే తెలియకుండా జరిగిపోతుంది. కొత్త ద్రవ్యరహిత రిజర్వుబ్యాంకింగ్ ప్రారంభమైనప్పట్నుంచి రూపాయి, డాలర్ విలువలు కొన్ని వందల భాగానికి పడిపోయాయి. ఇంతటి దుర్మార్గాన్ని తనలో ఇముడ్చుకున్న ప్రజాస్వామ్య వ్యవస్థను ప్రశ్నించొద్దా?

ఇక పన్నుల వడ్డింపు విషయానికొస్తే, రాచరిక కాలంలో మొత్తం పన్నులు దేశ ఉత్పత్తి, ఆదాయాల్లో రెండునుంచి నాలుగు శాతం మాత్రమే ఉండేవి. దాంతోనే రాజరిక వ్యవస్థ, హంగు, ఆర్భాటాలు, కొద్దిపాటి సైన్యం నడిపేవారు. పన్నులు పెంచాలంటే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందని భయపడేవారు. ప్రజలు కూడా పన్నుల పెంపును నిరసించేవారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో పన్నుల విధింపునకు అడ్డు, అదుపే లేదు. ప్రజలు కూడా మనకు మనమే రాజులం, మనం ఎన్నుకున్న ప్రభుత్వమే కదా విధించేది అని పన్నులను నిరసించే హక్కును, చొరవను కోల్పోయారు. దాంతో క్రమేణా పెరుగుతూ, నేటికి దేశ ఉత్పత్తిలో దాదాపు సగ భాగం, అంటే యాభై శాతం వరకు వివిధ పన్నుల రూపంలో రాజ్యం లాగేసుకుంటోంది. దీనికి అమెరికా, స్వీడన్, మనదేశం ఏవీ అతీతం కాదు. అంటే ఇప్పటికే యాభై శాతం సోషలిజంలో ఉన్నాం. ఈ శాతం పెరిగేది తప్ప తగ్గేది కాదు. అంటే మొదట ప్రజాస్వామ్యమనుకున్నది క్రమేపీ, అమెరికాతో సహా, సోషలిజంలోకి రూపాంతరం చెందుతోంది. ప్రపంచం కోరుకున్నది ఇదేనా?

ఇంకా వివిధ అంశాలను పోల్చుకుంటూ పోతే రాచరిక వ్యవస్థతో పోలిస్తే ప్రజాస్వామ్య వ్యవస్థ సమాజానికేమీ హితం చేసినట్లు కనబడడం లేదు. కానీ ఈ విశ్లేషణ తాత్పర్యం రాచరిక వ్యవస్థను సమర్థించడం ఎంతమాత్రం కానేకాదు. రాచరికం నుంచి మారి మనం అనుసరిస్తున్న ప్రజాస్వామ్యం అసలు అభ్యుదయమా, లేక తిరోగమనమా అన్న చర్చ లేవదీయడమే ముఖ్య ఉద్దేశం. పోనీ ప్రజాస్వామ్యం ఇలా కాకుండా ఇంకొంచెం మెరుగ్గా ఉండే వెరైటీలేమన్నా ఉన్నాయా? ఆ రోజుల్లో ప్రజాస్వామ్యం ఎంచుకోవడం తప్ప ప్రపంచ దేశాలకు ఇతర ఆప్షన్లు ఏవైనా ఉన్నాయా?

నిజాములు, మొగలాయిలు, విజయనగర సామ్రాజ్యాల వంటి రాజ్యాల విధివిధానాలను తరచి చూడాల్సిన అవసరం లేకుండా, సిద్ధాంత పరంగా, కేవలం సైద్ధాంతిక, తర్క స్థాయిలో రాచరికాన్ని, ప్రజాస్వామ్యాన్ని పోల్చి చూసి ఎందులో ఏది మంచి, ఏది చెడు అనేది నిర్ధారించుకోవడం సాధ్యం, అవసరం కూడా. ఇప్పటికైనా సరైన విశ్లేషణ, అవగాహనల ద్వారా ప్రజాస్వామ్యాన్ని ప్రక్షాళన చేయడమో, లేక దాన్ని త్యజించి, ఇంకో కొత్త వ్యవస్థను నిర్మించుకోవడమో విజ్ఞుల లక్ష్యం కావాలి.
సశేషం.
- జాహ్నవి

Source: Andhra Jyothi