Friday, November 15, 2013

సవరణ తప్పదు!

Published at: 15-11-2013 07:52 AM




రెండు రాష్ట్రాల్లోనూ 371(డి) ఉండాలి
విభజన బిల్లుతో పాటే రాజ్యాంగ సవరణ బిల్లు
జీవోఎంకు న్యాయశాఖ సూచన
మరో రెండు ఓడు రేవులు ఇస్తాం
విమానాశ్రయాల విస్తరణ, కొత్తగా మరికొన్ని
హైదరాబాద్‌లోని ఉద్యోగులకు 'ఆప్షన్స్'
వరంగల్, విశాఖలో సీఆర్పీఎఫ్ స్థావరాలు
ఆయా శాఖల ఉన్నతాదికారులు సూచనలు
అన్నీ తేల్చిన తర్వాతే ఆర్థిక శాఖ నివేదిక

(న్యూఢిల్లీ - ఆంధ్రజ్యోతి)
రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ, సీమాంధ్ర రాష్ట్రాలు రెండింటిలోనూ రాజ్యాంగంలోని ఆర్టికల్ 371(డి)ని కొనసాగించాలని కేంద్ర న్యాయ శాఖ మంత్రుల బృందానికి సూచించింది. స్థానిక రిజర్వేషన్ల కోసం రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా ఏర్పడిన ఈ అధికరణను అమలు చేయడమే ఆయా ప్రాంతాల ప్రజలకు మంచిదని స్పష్టం చేసింది. ఆ మేరకు రాజ్యాంగంలో సవరణ చేయాల్సి ఉంటుందని వెల్లడించింది. విభజన బిల్లుతోపాటే రాజ్యాంగ సవరణ బిల్లును కూడా ప్రవేశపెట్టాలని సూచించింది. సవరణ తప్పనిసరి అయితే సాధారణ మెజారిటీ సరిపోతుందా? లేక మూడింట రెండొంతుల మెజారిటీ కావాల్సిందేనే? అనే అంశంపై న్యాయశాఖ అధికారులు స్పష్టంగా సమాధానం ఇవ్వలేదని సమాచారం. దీంతో సోమవారం అటార్నీ జనరల్ వాహనవతితో భేటీ కావాలని జీవోఎం సభ్యులు నిర్ణయించారు. గురువారం సాయంత్రం 4 గంటల నుంచి 8.30 గంటల వరకూ జీవోఎం అధ్యక్షుడు, హోం శాఖ మంత్రి షిండే కార్యాలయంలో సుదీర్ఘంగా జరిగిన సమావేశంలో ఆర్థిక, సిబ్బంది-శిక్షణ వ్యవహారాలు, న్యాయ, రైల్వే, పౌర విమానయాన, ఓడరేవులు, ఉపరితల రవాణా శాఖల కార్యదర్శులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో షిండే, జైరామ్ రమేశ్, వీరప్ప మొయిలీలు మాత్రమే ఆద్యంతం పాల్గొన్నారు. మరొక సభ్యుడు నారాయణస్వామి మధ్యమధ్యలో సమావేశానికి హాజరయ్యారు. ఆంటోనీ, చిదంబరం, ఆజాద్‌లు పూర్తిగా గైర్హాజరయ్యారు. తొలుత హోం శాఖ నియమించిన టాస్క్‌ఫోర్స్ సభ్యులు విజయ్‌కుమార్, రాజీవ్ శర్మ, వాసన్ జీవోఎంతో సమావేశమయ్యారు. హైదరాబాద్ స్థితిపై దాదాపు గంటసేపు చర్చలు జరిగినట్లు తెలిసింది. ప్రతిపాదనలపై విజయ్ కుమార్ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. నక్సల్స్‌కు సంబంధించి పరిస్థితి అదుపులోనే ఉందని... ఇప్పుడు తీసుకుంటున్న చర్యలను మరింత పటిష్ఠంగా అమలు చేస్తే రెండు రాష్ట్రాల్లో ఎలాంటి సమస్యలూ రాకుండా చూడొచ్చని తెలిపారు. విభజన అనంతరం ఇరు రాష్ట్రాలూ నిఘా సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవటం, ఇరు రాష్ట్రాల్లోనూ ఆక్టోపస్, గ్రేహౌండ్స్ ఏర్పాటుపై కీలక ప్రతిపాదనలు చేశారు. వరంగల్, విశాఖపట్నం నగరాల్లో సీఆర్పీఎఫ్ బేస్ క్యాంపుల్ని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు.

ఆర్థిక శాఖ : చివర్లో చెబుతాం
ఇప్పుడు మేం నివేదిక ఇచ్చినా ఉపయోగం ఉండదు. మిగతా శాఖలు ఇచ్చిన ప్రతిపాదనల ఆధారంగా మా నివేదికను రూపొందించాల్సి ఉంటుంది. ఏయే శాఖలు ఏమేం ప్రతిపాదనలు సమర్పించాయో, హైదరాబాద్ ఆదాయ పంపిణీపై ఏం నిర్ణయం తీసుకున్నారో కూడా స్పష్టం చేయండి. హైదరాబాద్ ప్రతిపత్తి ఏమిటి? ఆదాయాన్ని ఎలా పంచుతున్నారు? మా నివేదిక రూపకల్పనలో ఇవన్నీ ముఖ్య భూమిక పోషిస్తాయి. హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం చేస్తే అక్కడున్న అనేక సంస్థలు మున్ముందు కూడా అక్కడే కొనసాగుతాయి. చేయకపోతే పరిస్థితి మరోలా ఉంటుంది. అక్కడ ఉన్న కంపెనీలన్నీ మరొక చోటికి మారిపోతే పరిస్థితి ఏంటి? తద్వారా ఆదాయం తగ్గిపోతే దానిని ఎవరు భరించాలి? వీటిపై స్పష్టత లేకుండా మేం ముందే ప్యాకేజీలను ప్రకటిస్తే... తర్వాత పరిస్థితి తారుమారైతే ఆ భారాన్ని మళ్లీ కేంద్రమే భరించాల్సి ఉంటుంది. కాబట్టి, సమగ్రమైన సమాచారాన్ని మాకు ఇస్తే ఆ మేరకు ప్యాకేజీలను ఖరారు చేస్తాం. మా నివేదికను చివరగానే ఇస్తాం.

శాసన వ్యవహారాల విభాగం : ముసాయిదా
విభజన బిల్లు తయారీకి సంబంధించిన ముసాయిదా మా వద్ద సిద్ధంగా ఉంది. 371(డి) సవరణ బిల్లు ప్రవేశపెట్టాలని చెబితే దానిని కూడా సిద్ధం చేస్తాం. సవరణ బిల్లును కూడా విభజన బిల్లుతో పాటే పార్లమెంటులో ప్రవేశ పెట్టాల్సి ఉంటుంది. దీనిపై నిర్ణయం తీసుకుని మాకు చెప్పండి.

ఓడరేవులు అనుమతులు ఇచ్చేశాం
దుగరాజపట్నం, రామాయపట్నంలో ఓడ రేవుల ఏర్పాటుకు మేం అనుమతులు ఇచ్చేశాం. నిర్మాణ పనుల్ని ఎప్పుడు ప్రారంభించాలన్నది రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయించుకోవాలి. కోస్తా తీరంలో ఇప్పటికే ఉన్న ఓడరేవులతోపాటు మరో రెండింటిని కేటాయించేందుకు మేం సుముఖం. సీమాంధ్రలో జల రవాణా మార్గాలను కూడా అభివృద్ధి చేయాలి.

పౌర విమానయానం : కొత్త ఎయిర్‌పోర్టులకు సిద్ధం

ఇరు రాష్ట్రాల్లో ఉన్న విమానాశ్రయాలను అభివృద్ధి చేసేందుకు మేం సిద్ధం. కొత్తగా విమానాశ్రయాలను ఏర్పాటు చేసేందుకు కూడా రెడీగా ఉన్నాం. ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలనేది నిర్ణయించి, ఆ మేరకు భూ సేకరణ చేసి ఇస్తే మేం అభివృద్ధి చేస్తాం. విశాఖపట్నం విమానాశ్రయం అభివృద్ధికి రక్షణ శాఖ నుంచే అనుమతులు రావాలి.

Source: Andhra Jyothi

No comments: